వాతావరణాన్ని తట్టుకునే 35 వంగడాల విడుదల

వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే 35 వంగడాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి అతి పెద్ద సవాలు అని మోదీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై పోరాటాన్ని మరింత పెంచవలసిన అవసరం ఉందన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఓ ప్రకటనలో ఈ వివరాలను తెలిపింది. 

మోదీ  విడుదల చేసిన వంగడాలకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని పీఎంఓ తెలిపింది. వాతావరణ మార్పులను తట్టుకోగలిగే టెక్నాలజీలను ఉపయోగించుకోవడం పట్ల అవగాహనకు ఈ వంగడాలు దారి చూపుతాయని పేర్కొంది. ఈ వంగడాలను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అభివృద్ధిపరచింది.

వాతావరణ మార్పులు, పోషకాహార లోపం సవాళ్ళను ఎదుర్కొనగలిగేలా వీటిని అభివృద్ధిపరిచింది. ఇవి వాతావరణ మార్పులను తట్టుకుని నిలవగలవు. వీటిలో పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి. కొమ్ము శనగలు, కందులు, సోయాబీన్, వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్న, క్వినోవా, బక్‌వీట్ (ఒక తరహా గోధుమలు) వంటివాటిని అభివృద్ధి చేసింది. ఇవి కరువు కాటకాలను తట్టుకోగలవు.

వాతావరణ మార్పుల వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో జనాభా పెరుగుతోందని, దీనికి అనుగుణంగా తగిన ఆహారాన్ని, పోషకాహార భద్రతను కల్పించడంపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులను తట్టుకోగలిగే వ్యవసాయ నవ కల్పనల కోసం కార్యక్రమాన్ని 2011లో ఐసీఏఆర్ ప్రారంభించింది.