సిద్ధూ రాజీనామా, ఢిల్లీకి అమరిందర్ … కాంగ్రెస్ లో కలకలం

గతవారం అర్ధాంతరంగా పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరిందర్ సింగ్  పార్టీ నాయకత్వం వ్యవహరించిన తీరుపట్ల `అవమానభారంతో’ పదవికి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో  జరుగుతున్న పరిణామాలు మంగళవారం ఒకేసారి కలకలం రేపుతున్నాయి. అమరిందర్ రాజీనామాచేసేటట్లు చేయడానికి కారణమైన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు పార్టీ పదవికి రాజీనామా చేయడం,  అమరిందర్ సింగ్ ఢిల్లీకి బయలుదేరడంతో కొద్దీ నెలల్లో ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో కాంగ్రెస్ భవిష్యత్ పట్ల ఆ పార్టీలో ఆందోళన బయలుదేరింది. 
 
పంజాబ్ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్‌ విషయంలో రాజీపడబోనంటూ సిద్దూ లేఖ రాసి పార్టీ అధిష్టానానికి పంపారు. అయితే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సిద్ధూకు గత జూన్ లోనే పంజాబ్ పీసీసీ పదవిని అధిష్టానం కట్టబెట్టింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుయాయులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి కారణంగానే రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
 
పైగా, సిద్ధుకు పాకిస్థాన్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో సరిహద్దు రాష్ట్రంలో అతను పార్టీకి సారధ్యం వహించడం దేశ భద్రతకు ముప్పు అంటూ అమరిందర్ సింగ్ విమర్శించడం, ఈ విమర్శలపై కాంగ్రెస్ నేతలెవ్వరూ స్పందించక పోవడంతో కూడా సిద్దూ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. 
 
ఈ పరిణామాలతో, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ హడావుడిగా హిమచల్ ప్రదేశ్‌లోని సిమ్లా నుంచి ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఛండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 
 
దీనికి కొద్ది సేపటి క్రితమే అమరీందర్ సింగ్ సైతం ఛండీగఢ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఆయన ఢిల్లీలో బిజెపి నాయకులను కావచ్చని కధనాలు వెలువడడంతో కాంగ్రెస్ కలవరంకు గురవుతున్నది.  కెప్టెన్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, తన సన్నిహితులను కలుసుకునేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని కెప్టెన్ మీడియా అడ్వయిజర్ వివరణ ఇచ్చారు. ఢిల్లీలో సోనియాగాంధీని ఆయన కలుసుకుంటారని కూడా చెబుతున్నారు. 
 
ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన కొద్ది రోజులకే పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. మరో ఆరు నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. ఇలాంటి సమయంలో వరుస రాజీనామాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.
 
 నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంపై కెప్టెన్ అమరీందర్ సింగ్ సిద్ధూకు నిలకడ లేదని తాను ముందే చెప్పానంటూ ట్వీట్ చేస్తూ ఎద్దేవా చేశారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సిద్ధూ సరైన నేత కాదని కెప్టెన్ మరోసారి పునరుద్ఘాటించారు.
 
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని.. కెప్టెన్ రాజీనామాతో కాంగ్రెస్ సగం బలహీన పడితే, సిద్ధూ రాజీనామాతో పూర్తిగా చెదిరిపోయిందని నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సిద్ధూకి కాంగ్రెస్ ఎంతో చేసిందని, అయితే సిద్ధూ పార్టీకి విశ్వనీయంగా ఉండలేకపోయారని కాంగ్రెస్ మద్దతుదారులు అంటుంటే.. అనుకున్నట్లుగానే పని పూర్తి చేశారని త్వరలోనే బీజేపీకి తిరిగి వస్తారని బీజేపీ మద్దతుదారులు ట్రోల్స్ వేస్తున్నారు. కపిల్ శర్మ షో కంటే పెద్ద కామెడీ షోలా కాంగ్రెస్ పార్టీ మారిపోయిందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.