హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రకటనతో  ఈటెల దూకుడు 

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్, బీజేపీ నేతలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. బీజేపీ తరుపున బరిలో ఉన్న మాజీ మంత్రి  ఈటల రాజేందర్  టీఆర్‌ఎస్ పార్టీనే టార్గెట్ గా దూకుడు పెంచారు. సీఎం కేసీఆర్, మంత్రులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 ”కేసీఆర్ అహంకానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక” అని ఈటల  అభివర్ణించారు. సిఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 

అధికార పార్టీ ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా హుజూరాబాద్ ప్రజలు ఈటలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మహిళలు, యువకులు, పెద్దలు అందరూ తన వెంటే ఉన్నారని ఈటల ధీమా వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారని విమర్శించారు. 

రాత్రి పూట పోలీస్ జీపులతో బీజేపీ నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నీచపు పార్టీ అని.. ఆ పార్టీ నేతలు నీచపు మనుషులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం దొంగ ఓట్లు చేర్చుతున్నారని ఆరోపించారు. చిల్లర చేష్టలు చేస్తే ప్రజలు సహించరని ఈటల వ్యాఖ్యానించారు.

ఆత్మగౌరవం పేరుతో రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందరే బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండగా, టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించింది. అయితే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు తమ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. 

కాంగ్రెస్ తరుపున మాజీ మంత్రి కొండా సురేఖ బరిలో ఉంటారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నా ఆమె పేరును మాత్రం పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ మధ్యనే పిసిసి నాయకత్వం చేపట్టిన ఎ రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికలు పరీక్షగా నిలిచాయి. కాంగ్రెస్ అభ్యర్థి కనీస  పోటీ ఇవ్వలేని పక్షంలో తెలంగాణ రాజకీయాలు ఇక టీఆర్ఎస్, బిజెపిల మధ్యనే కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది.

“ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ అక్టోబర్ 2వ తేదీన హుజురాబాద్‎లో ఉంటుంది. ఆ రోజు హుజురాబాద్ పోవుడే.. కేసీఆర్ సంగతేందో చూసుడే” అంటూ పాదయాత్రలో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై వ్యాఖ్యానించారు. “హుజురాబాద్ పక్కా మేమే గెలుస్తాం. టీఆర్ఎస్ డిపాజిట్ కోసం తండ్లాడుతోంది” అంటూ భరోసా వ్యక్తం చేశారు.

ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం.. ప్రజలందరికీ చేరువ కావడం ఈటలకు కలిసొచ్చే అంశం. అన్ని మండలాలు ఆయనకు సుపరిచితమే. ప్రతిఒక్కరినీ పేరుపేరున పలకరించేంత ప్రజల్లో కలిసిపోయారు. పైగా స్థానికుడు. ఈటలపై ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం బహిష్కరించిందనే సానుభూతి ప్రజల్లో ఏర్పడడం, నరేంద్ర మోదీ హవా కూడా కనిపించే అవకాశం ఉందని రాజేందర్ గెలుపుపై ధీమాగా ఉన్నారు.