పాక్ లో 12 భయంకర ఉగ్రముఠాలు!

పాకిస్థాన్‌లో మొత్తం 12 భయంకరమైన ఉగ్రముఠాలు ఉన్నట్లు అగ్రరాజ్యం అమెరికా నివేదికలో వెల్లడైంది. వారం క్రితం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన క్వాడ్ దేశాల సమావేశం జరగిన సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌‌కు చెందిన స్వతంత్ర కాంగ్రెస్ రీసెర్చ్ (సీఆర్ఎస్) విభాగం ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, పాకిస్థాన్‌లో జైషే మహమ్మద్, లష్కర్ ఏ తైబా సహా మొత్తం 12 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి.

‘పాకిస్థాన్‌లోని ఉగ్రవాద, ఇతర మిలిటెంట్ ముఠాలు’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో పలు ఆసక్తికర అంశాలను పరిశోధకులు వెల్లడించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ 1980వ సంవత్సంలో ఏర్పడగా, 2001లో ఎఫ్టీవో అనే విదేశీ ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. 

పాక్ ఉగ్రవాదులకు స్వర్గథామంగా కొనసాగుతోందని నివేదికలో వెల్లడైంది.పాకిస్తాన్ లోఉగ్రవాద గ్రూపులు అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్-ఖోరాసన్ ప్రావిన్స్, ఆఫ్ఘన్ తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్, తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, జుందల్లా (అకా జైష్ అల్-అడ్ల్), సిపా-ఇ-సహబా పాకిస్థాన్, లష్కరే-జాంగ్వి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాయని అమెరికా తాజా నివేదికలో వెల్లడైంది. 

పాక్‌లోని ఉగ్రవాద ముఠాలను ఐదు రకాలుగా విభజించారు. ప్రపంచం మొత్తానికి సంబంధించినవి, ఆఫ్ఘనిస్థాన్‌కే పరిమితమైనవి, భారత్-కశ్మీర్‌కు పరిమితమైనవి, స్వదేశీ పరిమితమైనవి, యాంటీ షియా ముఠాలు. 1980లో ఏర్పడిన ‘లష్కర్ ఏ తైబా’ ఉగ్రవాద ముఠాను 2001లో ఫారెన్ టెర్రరిస్టు సంస్థ (ఎఫ్‌టీవో)గా గుర్తించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ 2008లో ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు సీఆర్‌ఎస్ తెలిపింది.

2001లో కశ్మీరీ ఉగ్రవాద నాయకుడు మసూద్ అజహర్ స్థాపించిన జైష్-ఏ-మహమ్మద్ సంస్థ కూడా 2001లో ఎఫ్‌టీవో జాబితాలో చేరిందని వెల్లడించింది. ఈ సంస్థ 2001 భారత పార్లమెంటుపై దాడుల్లో కీలక పాత్ర పోషించింది. జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ బహిరంగంగానే అమెరికాపై యుద్ధం ప్రకటించిన విషయాన్ని ఈ నివేదికలో ప్రస్తావించారు. 

ఈ రెంటితోపాటు హరకత్-ఉల్ జిహాద్ ఇస్లామీ (హుజీ) అనే ఉగ్రవాద ముఠాను కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే ఈ ముఠా బలం ఎంతనే విషయం ప్రస్తుతం ఎవరికీ తెలియదని సీఆర్‌ఎస్ తెలియజేసింది. 1980లో స్థాపించిన ఈ సంస్థను 2010లో ఎఫ్‌టీవో జాబితాలో చేర్చడం జరిగింది.

ఈ ముఠా నెమ్మదిగా భారత్, పాక్, బంగ్లాదేశ్‌లో కూడా వ్యాపించినట్లు నివేదిక చెప్తోంది. కశ్మీర్‌ను ఎలాగైనా పాక్‌లో కలపాలని ఈ ఉగ్రవాద ముఠా పనిచేస్తోంది. 1989లో ఏర్పడిన హిజ్బుల్ ముజాహిదీన్ కూడా 2017లో ఎఫ్‌టీవో జాబితాలో చేరింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాల్లో ఆల్‌ఖైదా కూడా ఉందని, ఈ ముఠా దేశంలోని వివిధ వర్గాలతో మంచి సంబంధాలు కలిగి ఉందని సీఆర్ఎస్ రిపోర్టు తెలిపింది. 

మొత్తానికి భారత్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలను టార్గెట్ చేస్తున్న ఉగ్రముఠాలకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తునట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. 2015లో చేసిన నేషనల్ యాక్షన్ ప్లాన్‌లోని కీలక అంశాలపై ఈ దేశం సరిగా పనిచేయడం లేదని సీఆర్ఎస్ పేర్కొంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్, భారత దేశాలకు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రముఠాలపై పాకిస్థాన్ చర్యలు కరువయ్యాయని ఆరోపించింది.

పాక్ లో నిరుద్యోగ భూతం 

ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్ లో నిరుద్యోగం అక్కడి యువతను కాటేస్తున్నది. పాకిస్తాన్‌లో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకున్నది. కరోనా వ్యాప్తి సమయంలో దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ముందే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఇక్కడ నిరుద్యోగిత రేటు 16 శాతం దాటిందని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ (పీఐడీఈ) కొత్త గణాంకాలను బట్టి తెలుస్తున్నది. ప్రస్తుతం చదువుకున్న యువతలో 24 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. 

ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంఫిల్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని పాకిస్తాన్‌ వార్తాపత్రిక డాన్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 40 శాతం గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారు. ఎంఫిల్‌లో చదివిన వారు కూడా చాలా మంది ఉన్నారు.