గణపతి విగ్రహం చుట్టూ నేతల ఫ్లెక్సీలు, జై జగన్‌ నినాదాలే

జై బోలో గణపతి మహరాజ్‌కీ… జై! ఇది సర్వత్రా వినిపించే నినాదం! కానీ… గుంటూరు జిల్లాలో మాత్రం దీంతోపాటు పార్టీల నినాదాలూ వినిపిస్తాయి. గణేశుడి మెడలోనూ పార్టీల కండువాలు కనిపిస్తాయి. గుంటూరు జిల్లాలో కొన్నేళ్లుగా గణపతికీ రాజకీయ రంగు పులుముతున్నారు. 
 
అంతేకాదు, అధికార పార్టీ వారి గణపతి ఊరేగింపులకు అన్ని అనుమతులూ లభిస్తాయి. కానీ… ప్రత్యర్థి వర్గీయుల విఘ్నేశుడికి మాత్రం అన్నీ విఘ్నాలే! నేరుగా వైసీపీ వినాయకుడు, టీడీపీ వినాయకుడిగా దేవుడిని విభజించేశారు.  వైసీపీ వినాయకుడికి  పూర్తి పార్టీ రంగు పులిమేశారు. గత ఏడాది కొద్దిగా మొదలైన ఈ పెడధోరణి  ఈసారి మరింత శ్రుతి మించింది.
విగ్రహానికి అటూఇటూ ముఖ్యమంత్రి జగన్‌, స్థానిక ఎమ్మెల్యే కటౌట్లు,  వైసీపీ రంగు జెండాలు, ఆ పార్టీకి చెందిన పాటలతో ఆధ్యాత్మిక వేడుకలో రాజకీయ రచ్చ చేయడం మొదలైంది. ఇక… నిమజ్జన ఊరేగింపుల్లో వినాయకుడి భజనలు, కీర్తనలు కాకుండా ‘జై జగన్‌… జైజై జగన్‌’ నినాదాలే వినిపించాయి.
 
 పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌, కరోనా ఆంక్షల పేరుతో రాజకీయ ప్రత్యర్ధులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపులను అడ్డుకున్నారు. అదే… అధికారపక్ష నేతల ఊరేగింపులను మాత్రం ఎంచక్కా అనుమతించారు. పార్టీల వారీగా విగ్రహాలు, ఊరేగింపులతోపాటు.. గొడవలూ, ఉద్రిక్తతలూ మొదలయ్యాయి. 
 
ఈసారి వైసీపీ శ్రేణుల వీరంగం మరీ శ్రుతిమించింది. పోలీసులు కూడా చేతులెత్తేసి విధ్వంసానికి మౌన సాక్షులుగా మిగిలారు. కొన్నిచోట్ల వారూ దెబ్బలు తిని బాధితులుగా మారారు. ఇలాంటి ఘటనలు హోంమంత్రి సుచరిత నియోజకవర్గంలోనే అధికంగా జరగడం మరో విశేషం. 
 
ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో వైసీపీ వినాయకుడి విగ్రహ ఊరేగింపులో పార్టీ కక్షలు బహిర్గతమయ్యాయి. కోప్పరులో వైసీపీ  ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ఊరేగింపు సందర్భంగా భారీ విధ్వంసమే సృష్టించారు. వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు  ‘ఇంట్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకోండి’ అంటూ టీడీపీ నేతలకు ఉచిత సలహా ఇచ్చారు.