భారత్‌బంద్‌కు వైసిపి, టిడిపిలు మద్దతు అనైతికం

కేంద్రం చర్యలను నిరసిస్తూ ఈనెల 27న అఖిల భారత కిసాన్‌ సభ పిలుపు మేరకు నిర్వహిస్తున్న భారత్‌బంద్‌కు వైసిపి, టిడిపిలు మద్దతు ప్రకటించడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రైతు సంఘాలు, వామపక్షాలు, కాంగ్రెస్‌ బంద్‌కు పిలుపిస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పెర్నీ నాని ప్రకటించడం అనైతికమని ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. సంస్కరణలను స్వాగతించకుండా అవకాశవాద రాజకీయాలు చేస్తూ భారత్‌  బంద్‌కు మద్దతిస్తోందని ఆరోపించారు. 

సాగు చట్టాలపై చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా విపక్షాలు బంద్ కు పిలుపునిస్తే, ఆ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఏమిటని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ సర్కారు భారత్ బంద్ కు మద్దతిస్తోందని ఆరోపించారు.

ఏపీలో ఆర్థిక పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్ బంద్ ను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.  కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని స్పష్టం చేశారు. వాటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానివి అవకాశవాద రాజకీయాలు అని ఆగ్రహం వెలిబుచ్చారు.

విద్యుత్‌ ఛార్జీలపై పోరాడిన వారిపై బషీర్‌బాగ్‌లో కాల్పులు, రైతులపై లాఠీచార్జి చేయించిన చంద్రబాబు నేడు ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై వైసిపి, టిడిపిలకు మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు.