.ఒడిశా, ఏపీ సీఎం లకు ప్రధాని భరోసా 

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి ఒడిశా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల తీరంవైపు దూసుకొస్తున్నది. దాంతో రెండు రాష్ట్రాల సీఎంలు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా సమావేశాలు నిర్వ‌హించి.. ఈ విప‌త్తును ఎదుర్కొనే అంశంపై చ‌ర్చించారు. 

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కూడా ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఫోన్‌లు చేసి గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై  మాట్లాడారు. ఆ రెండు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్‌ను ఎదుర్కోవ‌డానికి తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి అడిగి తెలుసుకున్నారు.

తుఫాన్ గురించి ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని వారికి హామీ ఇచ్చారు. అంతేగాక ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా కూడా వెల్ల‌డించారు. కాగా, రెండు రాష్ట్రాల్లోని తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ఇప్ప‌టికే ఎన్‌డీఆర్ఎఫ్ బ‌ల‌గాలు మోహ‌రించాయి. ఒడిశాలో ఓడీఆర్ఎఫ్ బల‌గాలు కూడా రంగంలోకి దిగాయి.

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్‌ తుఫాన్‌ కొనసాగుతుంది. గోపాలపూర్‌కు 95 కి.మీ., కళింగపట్నానికి 85 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ అర్ధరాత్రి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరాంధ్రలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేయగా, శ్రీకాకుళం జిల్లాలో 75 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.