ఏపీలో గులాబ్‌ బీభత్సం.. భారీ వర్షాలు, ఈదురుగాలులు

గులాబ్‌ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను వల్ల రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 
 
తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కాగా, గులాబ్‌ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది. గడిచిన ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీనపడింది.
 
గులాబ్ తుఫాన్ కారణంగా విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు అవగా…మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖపట్నం కిరండోల్ స్పెషల్  రద్దు అయ్యింది. అలాగే యశ్వంతపూర్ హౌరా స్పెషల్ 5 గంటలు ఆలస్యంగా నడువనుంది. విశాఖపట్నం గుంటూరు స్పెషల్ మూడు గంటలు ఆలస్యం కానుంది. విశాఖపట్నం, హజరత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యం అవగా… చెన్నై సెంట్రల్ హౌరా స్పెషల్ ఎనిమిది గంటలు ఆలస్యంగా నడువనుంది. 
 
 అరకులోయ, అనంతగిరి మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి తోడు భారత్ బంద్ కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. అరకులోయ మండలంలో చొంపి వద్ద  బొండాం, కొత్తవలస మద్య అరకులోయ కోడి గడ్డ వంతెనపై నీరు ప్రవహిస్తోంది.  అరకులోయ ఘాట్ రోడ్‌లో పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారిలో సుమారు రెండు అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పర్యాటకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
 
గులాబ్‌ ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూసపాటిరేగ, గజపతినగరం, నెల్లిమర్ల మండలాల్లో 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదయ్యింది. భోగాపురం మండలంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి.విశాఖపట్నంలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. 
 
భారీవర్షానికి లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి విజయవాడలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.