భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం

భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆకాంక్షించారు. కొవిడ్‌, వాతావరణ మార్పులు, వాణిజ్య భాగస్వామ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్‌ పరిణామాలపై భారత్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో శ్వేతసౌధంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను భారత్‌-అమెరికా బంధం పరిష్కరించగలదని బైడెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ శుక్రవారం (భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు) అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయిన తర్వాత ఆయనతో మోదీ  ద్వైపాక్షిక సమావేశం కావడం ఇదే మొదటి సారి.

ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ నాలుగు మిలియన్ల మంది ఇండో అమెరికన్లు తమ దేశాన్ని ప్రతి రోజూ బలోపేతం చేస్తున్నారని తెలిపారు. భారత్ అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని చూస్తున్నామని ప్రధానితో బైడెన్ చెప్పారు. కాగా ఇరు దేశాల వ్యాపార భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు.

ప్రపంచ క్షేమం కోసం సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని పేర్కొన్నారు. బైడెన్ హయాంలో ఇరు దేశాల బంధం మరింత బలోపేతం కావాలని పేర్కొంటూ బైడెన్‌తో ఈ సమావేశం ఎంతో కీలకమైందని, ఇరు దేశాలకు ఈ సమావేశం ఎంతో ముఖ్యమైందని తెలిపారు. ఇరు దేశాల వాణిజ్య బంధానికి ఎంతో ప్రాధాన్యం ఉందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు.

ఈ శతాబ్దపు మూడో దశకం ప్రారంభంలో మనం సమావేశమవుతున్నామని, ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి చాలా ఏళ్ల క్రితమే బీజాలు పడ్డాయని మోదీ చెప్పారు. వచ్చే నెల జరగబోయే గాంధీజీ జయంతి గురించి బైడెన్ ప్రస్తావించడాన్ని ప్రధాని గుర్తు చేస్తూ , గాంధీజీ ధర్మకర్తత్వం గురించి చెప్పారని, రాబోయే దశకాల్లో మన ప్రపంచానికి అది చాలా ముఖ్యమన్నారని వివరించారు.

ఈ దశాబ్దం టెక్నాలజీ, ప్రజల మధ్య సంబంధాలతో రూపు దిద్దుకుంటుందని, అమెరికా అభివృద్ధిలో ఇక్కడి భారతీయ సంతతి వారుతమ వంతు పాత్ర పోషిస్తున్నారని అనుకొంటున్నాను అని ప్రధాని అధ్యక్షుడితో చెప్పారు. అమెరికాలో తనకు లభించిన హృదయపూర్వక స్వాగతానికి బైడెన్‌కు మోదీ కృతజ్ఞతలు చెప్పారు.

2014, 2016లో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉండిన బైడెన్‌తో తాను జరిపిన సమావేశాలను కూడా ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. భారత్‌లో అయిదురు బైడెన్‌లు ఉన్నట్లు తనకు తెలిసిందని చర్చలకు ముందు బైడెన్ ప్రధానితో అనగా, వారికి సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా తనతో తీసుకు వచ్చానని మోదీ నవ్వుతూ చెప్పినట్లు తెలుస్తోంది.

బైడెన్ పూర్వీకులు భారత్‌లో ఉన్నట్లు గతంలో ఆయన భారత్ పర్యటన సందర్భంగా చెప్పడం తెలిసిందే. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు గ్లోబల్ వార్మింగ్, అఫ్ఘన్‌లో పరిస్థితి సహా పలు అంశాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా భారత్, అమెరికా బంధం మరింత బలోపేతం కావాలని అంతకు ముందు బైడెన్ ఆకాంక్షించారు. కొవిడ్, వాతావరణ మార్పు సహా పలు సమస్యలపై కలిసి పని చేస్తామని పేర్కొన్నారు. ఇండోపసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం పని చేస్తామంటూ ప్రధానితో భేటీకి ముందు బైడెన్ ట్వీట్ చేశారు.