ఆహారాన్ని మానవ హక్కుగా చూడాలి

ఆహారాన్ని మానవ హక్కుగా చూడాలని, వస్తువుగా కాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ స్పష్టం చేశారు. ఆహారాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా విలువ ఇస్తున్నామో పునరాలోచించాల్సిన అవసరం వుందని సూచించారు. వ్యాపారం చేసే వస్తువుగా కాకుండా, ప్రతి ఒక్క వ్యక్తి పంచుకునే హక్కుగా చూడాల్సి వుందని తెలిపారు. 

ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవస్థ సదస్సులో ఆయన ప్రసంగించారు.  రైతులు, మత్స్యకారులు, యువత, ఆదివాసీలు, ప్రభుత్వాధినేతలు ఇలా చాలామందిని ఒక్క తాటిపైకి తీసుకువస్తూ ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఆహార రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి 2030నాటికల్లా 17సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డిజి) సాధించేందుకు ప్రపంచాన్ని తిరిగి పట్టాలకెక్కించే ప్రయత్నంలో భాగంగా దీన్ని నిర్వహించారు. 

అయితే, ప్రపంచంలో ప్రతీ దేశంలో, కమ్యూనిటీల్లో, కుటుంబాల్లో ఈ నిత్యావసర అవసరం-ఈ మానవ హక్కు – నెరవేరకుండా పోతోందని ఆయన  ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ రోజు కోట్లాది మంది ప్రజలు ఆకలితోనే రోజు గడుపుతున్నారని, పిల్లలు కూడా కరువు వాతపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. 300కోట్ల మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినలేకపోతున్నారని చెప్పారు. 

మరో 200కోట్ల మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారని, 46.2కోట్ల మంది ప్రజలు తక్కువ బరువుతో బాధపడుతున్నారని వివరించారు. ఉత్పత్తి అయిన ఆహారంలో దాదాపు మూడో వంతు వృధా అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన ప్రభుత్వాలను, వాణిజ్య సంస్థలను కోరారు. 

మన భూగోళాన్ని కాపాడే ఆహార వ్యవస్థలను రూపొందించాలని సూచించారు. ఘర్షణలు, వాతావరణ మార్పులు, కరోనా వంటి మహమ్మారుల తాకిడులతో స్థానిక ఆహార వ్యవస్థలు దెబ్బ తినకుండా వుండేలా వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం వుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన ఆహారం అందుబాటులోకి వచ్చే ప్రపంచాన్ని మనందరం కలిసి నిర్మించాలని చెప్పారు.