కర్ణాటక ఉత్తమ శాసనసభ్యుడిగా యెడియూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పను 2020-21 సంవత్సరానికి ఉత్తమ శాసనసభ్యుడిగా ఆ రాష్ట్ర శాసనసభ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అతిథిగా విచ్చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు జ్ఞాపికను బహూకరించారు. 

లోక్ సభ, రాజ్యసభలో ఏటా అందించే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల మాదిరిగా ఈ ఏడాది నుంచి కర్ణాటక శాసనసభ సభ్యులకు ఉత్తమ శాసనసభ్యుడి అవార్డు ఇచ్చే ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కగేరి తెలిపారు. ఏటా ఒక లిజిస్లేటర్‌ను ఎంపిక చేసి, వారికి ఒక సర్టిఫికెట్, సిల్వర్ మెడల్ ప్రదానం జరుగుతుంది.

అనంతరం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కర్ణాటక అసెంబ్లీలో ప్రసంగీస్తూ మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలపై విస్తృతమైన చర్చలు జరుపడం మన విధి అని పేర్కొన్నారు. ఏర్పడిన చట్టాలపై ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తకుండా ఎమ్మెల్యేలు మరింత చురుకుగా సభా కార్యకలాపాల్లో పాల్గోవాలని ఆయన సూచించారు.

రాజ్యాంగ రూపకల్పన సమయంలో శాసనసభ్యలు మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా, నిజాయితీగా, కర్తవ్యబద్ధులై ఉండాలని నిపుణుల కమిటీ ఆశించిందని, తద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక అభ్యున్నతకి మార్గం సుగమం అవుతుందని భావించిందని ఆయన చెప్పారు.  ”మనం రూపొందించే చట్టాలపై విస్తృతంగా చర్చ జరపాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎమ్మెల్యేలంతా చురుకుగా వీటిల్లో పాల్గొనాలి. అప్పుడే మనం రూపొందించే చట్టాలపై ఎలాంటి ప్రశ్నలకు తావుండదు” అని ఓం బిర్లా పేర్కొన్నారు.

కాగా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగం కోసం నిర్వహించిన ఉమ్మడి సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఇలాంటిది మునుపెన్నడూ జరుగలేదని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య తెలిపారు. కర్ణాటక శాసనసభలో కొత్త విధానాన్ని సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.