విజయవాడలో మాంటిస్సోరీ స్కూల్‌ మూసివేత!

ఆరున్నర దశాబ్దాలకు పైగా చరిత్రను సంతరించుకున్న విజయవాడలో  ప్రతిష్టాత్మక మాంటిస్సోరి స్కూల్‌ మూసివేత నిర్ణయంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ప్రముఖ విద్యావేత్త దిగవంత వి కోటేశ్వరమ్మ దీనిని నెలకొల్పారు. 
 
టీచర్లను ప్రభుత్వం తీసుకుంటున్నందున పాఠశాలను పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు నగరంలోని చిల్డ్రన్స్‌ మాంటిస్సోరి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, కరస్పాండెంట్లు తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిస్తూ గురువారం నోటీసు జారీ చేశారు. విద్యార్థులు టీసీలు తీసుకుని వెంటనే సమీపంలోని పాఠశాలల్లో చేరాలని సూచించారు. 
 
 వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ ఒక్క స్కూలే కాదు కృష్ణా  జిల్లావ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 435 ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి నెలకొంది. సరిపోయినన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు లేకపోవడంతో ఇక  భారీ ఫీజ్ లతో ప్రైవేట్ విద్యాసంస్థలతో చేరవలసిందే. దానితో పేద వర్గాలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. 
 
ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను, వాటిలో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దానితో ఎయిడెడ్‌ పాఠశాలలే కాకుండా విజయవాడ నగరంలోని సిద్ధార్థ, శారద, శాతవాహన, కేబీఎన్‌ తదితర ఎయిడెడ్‌ కళాశాలలూ మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. 
 
లయోల, స్టెల్లా తదితర ఒకటి, రెండు విద్యాసంస్థలు తమ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించనప్పటికీ ఎక్కువమంది మాత్రం అంగీకారం తెలిపారు. 
విద్యాసంస్థల స్వాధీనంపై హైకోర్టు ఆగ్రహం 
 
ఎయిడెడ్‌ విద్యాసంస్థల అంగీకారాన్ని బలవంతంగా తీసుకుంటున్నారని వచ్చిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులకు కడప డీఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను పిటిషనర్‌ ధర్మాసనం ముందు ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా పిటిషనర్‌ ప్రొసీడింగ్స్‌ను ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపించారు.
ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయం కనపడుతోందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.  విద్యాసంస్థల అసోసియేషన్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎన్‌.సుబ్బారావు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది.
ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మరో విధంగా జరగుతున్నట్లు తెలుస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ నెల 29న డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ 29వ తేదీకి వాయిదా వేసింది.