జగన్ మెడకు చుట్టుకొంటున్న ఆఫ్ఘన్ హెరాయిన్!

జగన్ మెడకు చుట్టుకొంటున్న ఆఫ్ఘన్ హెరాయిన్!
ఆఫ్ఘానిస్తాన్ నుండి భారత్ కు చేరుకొని ఇటీవల గుజరాత్ పోర్ట్ లో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేస్తున్నది. ఈ డ్రగ్స్ టాల్కమ్ పొడి పేరుతో విజయవాడలోని చిరునామాతో భారత్ కు హెరాయిన్ దిగుమతి చేసుకున్నట్లు తేలడంతో ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అవుతున్నది. 
 
జగన్ ప్రభుత్వం అందిస్తున్న చౌకరకం మద్యంలో మత్తు వచ్చేటట్లు చేయడానికై దీనిని దిగుమతి చేసుకొంటున్నారని ఆరోపణలు వస్తుండడం ప్రభుత్వాన్ని కుదిపివేస్తున్నది. అయితే కేవలం చిరునామా విజయవాడది అయినా, మొత్తం వ్యవహారం చెన్నై కేంద్రంగా జరిగినదని ఏపీ డిజిపి  గౌతమ్ సవాంగ్ కొట్టిపారవేస్తున్నారు.
కానీ ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు, సలహాదారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేపట్టిన డిఆర్ఐ కి మాత్రం ఏపీతో సంబంధాలు వెల్లడి అవుతున్నట్లు తెలుస్తున్నది. గుజరాత్ ఓడరేవుకు మాత్రమే కాదు, ఏపీలోని కృష్ణపట్నం పోర్ట్ ద్వారా కూడా దిగుమతి అయిన్నట్లు భావిస్తున్నారు.
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న డ్రగ్ మాఫియా సూత్రధారి విజయవాడ చిరునామాతో ఏర్పాటు చేసిన ఆశి ట్రేడింగ్ కంపెనీ ని లైసెన్స్ తోనే హెరాయిన్ దిగుమతి చేసిన్నట్లు ఎన్ఐఎ దర్యాప్తులో వెల్లడైన్నట్లు తెలుస్తున్నది.
ఈ నెల 13న గుజరాత్ లోని ముద్రా ఓడరేవుకు చేరుకున్న రెండు కంటైనర్ల హెరాయిన్ ను పట్టుకున్నారు. మూడు వేల కిలోలున్న దీని విలువ రూ 21,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే కంపెనీ పేరుతో కృష్ణపట్నం రేవుకు కూడా దిగుమతి అయిన్నట్లు భావిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల కోసం ముంద్రా పోర్ట్ ను, దక్షిణాది రాష్ట్రాల కోసం కృష్ణపట్నం పోర్ట్ ను ఉపయోగించుకొంటున్నట్లు అనుమానిస్తున్నారు.
చెన్నై లో నిఘా ఎక్కువగా ఉండడం, పైగా దిగుమతి లైసెన్స్ ఏపీ చిరునామాతో ఉండడంతో సమీపంలోని కృష్ణపట్నంను ఉపయోగించుకున్నట్లు చెబుతున్నారు. డ్రగ్ మాఫియా ఆర్ధిక అక్రమాలతో ఉగ్రవాద కోణం కూడా ఉండడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తున్నది.
మాఫియా కంటైనర్లలో దిగువున హెరాయిన్ ను పేర్చి, పైన టాల్కమ్ పౌడర్ కు వాడే రాళ్లను పేర్చారు. కింద తనిఖీ చేయాలంటే ఆ రాళ్లు అన్నింటిని తీయవలసి ఉంటుంది. దానితో హెరాయిన్ ను వెలికి తీయడంకోసం అధికారులు చాలా కష్టపడవలసి వచ్చింది. సుధాకర్ దంపతులతో పాటు ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ కు చెందిన మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ కోణంపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
 
గతంలో ఇటువంటి కన్సైన్మెంట్‌లు వచ్చాయా అనే కోణంలో డీఆర్‌ఐ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దీంతో సెంట్రల్ విజిలెన్స్, నార్కోటిక్ బ్యూరో, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్‌ అక్రమ రవాణా జరుగుతోందని, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి రూ.వేల కోట్లు దిగుమతి అవుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
డ్రగ్స్‌ వ్యాపారానికి గేట్లు ఎత్తి సంఘ వ్యతిరేక శక్తులు, టెర్రరిస్టు సంస్థలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో టాల్కమ్‌ పౌడర్‌ కంపెనీ పేరుతో రూ.21 వేల కోట్ల హెరాయిన్‌ పట్టుబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ముఖ్యమంత్రి, డిజిపి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నాసిరకం మద్యంతో సొంత బ్రాండ్లు తెచ్చి మందుబాబులను ఆర్థికంగా, శారీరకంగా పీల్చిపిప్పి చేస్తున్నారని ఆరోపించారు.
 
రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల హెరాయిన్ అక్రమ రవాణా వెనుక ఉన్న బిగ్‌బాస్ ఎవరో కేంద్ర నిఘా సంస్థలు తేల్చాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మత్తు మందు కారణంగా రాష్ట్రంలో దాడులు పెరిగాయని చెప్పారు. అధికారుల కారుల్లోనే మత్తుమందు డబ్బులు విచ్చలవిడిగా రవాణా అవుతోందని ఆయన ఆరోపించారు.