ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్ర గురించి “సుమోటో‘గా స్వీకరించాలని స్పష్టం చేస్తూ ఆ దేశంలో ఉగ్రవాద గ్రూపులు పని చేస్తున్నాయని, అమెరికా, భారత్ భద్రతలపై ఇస్లామాబాద్ ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు సూచించారు.
క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అగ్రరాజ్యానికి వెళ్లిన భారత ప్రధాని మోదీ తొలి రోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌తో భేటీ అయ్యారు. భారత్, అమెరికా సహజ భాగస్వాములని, ఒకే రకమైన విలువలు, భౌగోళిక రాజకీయ ఆసక్తి కలిగి ఉన్నామని, సమన్వయం, సహకారం పెంపొందించుకుంటామని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.
అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ పేర్కొంటూ కమలా హారిస్ ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని కొనియాడారు. అధ్యక్షుడు బైడెన్, కమలా నేతృత్వంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
“ప్రపంచం కఠినమైన సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో ప్రెసిడెండ్ బైడెన్, మీరు అధికారంలోకి వచ్చారు. అయినప్పటికీ చాలా తక్కువ సమయంలో కరోనాను అదుపుచేయడంతోపాటు చాలా విజయాలు సాధించారు” అంటూ మోదీ ప్రశంసించారు. ఈ భేటీ సందర్భంగా కమలా హారీస్‌ను భారత్‌కు రావాలని ప్రధాని ఆహ్వానించారు. కరోనా రెండో వేవ్‌లో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు అమెరికా అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగమి అని హారీస్ అన్నారు. కరోనాతో భారత్ తీవ్రంగా బాధపడుతున్న సమయంలో.. అక్కడి ప్రజలకు వ్యాక్సినేషన్ అందించడంలో తన బాధ్యతను అమెరికా నెరవేర్చడం గర్వంగా ఉందని కమలా హారీస్ తెలిపారు.
టీకా ఎగుమతులను త్వరలో పున: ప్రారంభిస్తామని భారత్ ప్రకటనను ఆమె స్వాగతించారు. భారత్‌లో రోజుకు కోటి మంది టీకా అందిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారని హారీస్ సంతోషం ప్రకటించారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత భారత్, అమెరికాలపై ఉందని హారిస్ చెప్పారు.
ఈ సందర్భంగా ఇండో-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. ఆప్గనిస్తాన్ లోని పరిస్థితులు, ప్రజాస్వామ్యం, ఇండో-పసిఫిక్ ముప్పు వంటి ఉమ్మడి సమస్యలపై చర్చించుకున్నారు.
అంతకుముందు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగాతో మోదీ సమావేశామయ్యారు. అమెరికా పర్యటనలో మోదీ కలవడం సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ అన్నారు. ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు మంచి స్నేహితుడని చెప్పారు. కరోనా తర్వాత ఇరువురు నేతలు ప్రత్యక్షంగా కలవడం ఇదే మొదటిసారి.
కాగా, ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై జపాన్ ప్రధాని సుగాతో మోదీ చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో షింజో అబే నుండి ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత సుగాతో ప్రధాని మోడీ తొలి వ్యక్తిగత సమావేశం ఇదే కావడం విశేషం. అంతకముందు అమెరికాలోని టాప్ కార్పొరేట్ సంస్థల సిఇఒలతో వేర్వేరుగా మోడీ భేటీ అయ్యారు. క్వాల్‌కోమ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటమిక్స్, బ్లాక్‌స్టోన్ సిఇఒలతో చర్చించారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు