తాలిబన్లకు వత్తాసు పలికేవారు దేశద్రోహులే

తాలిబన్లకు మద్దతివ్వడం అంటే దేశ వ్యతిరేకులు, మహిళలు, చిన్నారుల వ్యతిరేకులకు ఊతమిచ్చినట్టేనని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్‌ స్పష్టం చేశారు. ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను హెచ్చరించారు. 

హపూర్ జిల్లాలో రూ 340 కోట్ల వ్యయం కాగల పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు,  శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొన్న యోగి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని నవ భారత్‌ దిశగా నడిపిస్తున్నారని, ఇదే బాటలో యూపీ సైతం పలు రంగాల్లో ముందుకు సాగుతున్నదని చెప్పుకొచ్చారు. సుపరిపాలన, భద్రత విషయంలో ఆదర్శప్రాయంగా నిలుస్తోందని తెలిపారు. 

“కానీ ఇప్పటికీ, భారతదేశ అభివృద్ధిని ఇష్టపడని కొన్ని శక్తులు  ఉన్నాయి. ఎక్కడో, వారు దేశ అభివృద్ధి మార్గంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. తాలిబాన్ల క్రూరత్వానికి మద్దతిచ్చే అలాంటి వ్యక్తులను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది” అని ముఖ్యమంత్రి పిలుపిచ్చారు.

తాలిబాన్లకు మద్దతు ఇవ్వడం అంటే భారతదేశం, మానవత్వం, స్త్రీ వ్యతిరేకం, పిల్లల వ్యతిరేక చర్యలకు మద్దతు ఇవ్వడం అని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఈ రోజు జరుగుతున్న అఘాయిత్యాలు గురించి తెలుసుకొంటూనే  ఉగ్రవాద గ్రూపుకు మద్దతునిస్తూ సిగ్గులేని వ్యక్తులు కొందరు ఉన్నారని మండిపడ్డారు.  తాలిబాన్ల తప్పుడు చర్యలకు మద్దతు ఇచ్చే వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

రాష్ట్రంలోని మునుపటి బిజెపియేతర ప్రభుత్వాలపై విరుచుకుపడుతూ, 2017 కి ముందు వేడుకలు, కన్వర్ యాత్ర ఊరేగింపులకు పరిపాలన అనుమతిని నిరాకరించేవారని, అయితే గత నాలుగున్నర సంవత్సరాలలో ఇది మారిందని గుర్తు చేశారు.

భక్తి దేశానికి అతి పెద్ద బలం అని పేర్కొంటూ ప్రతి విశ్వాసం, ప్రతి వర్గం ప్రజలు చట్టపరిధిలో ఉన్నంతవరకు తమ పండుగలు, ఉత్సవాలు జరుపుకోవడానికి స్వేచ్ఛ ఉన్నదని స్పష్టం చేశారు. అటువంటి వారికి భద్రత, సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెబుతూ బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో అటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నదని తెలిపారు. అయితే వ్యక్తిగత విశ్వాసం జాతీయ భద్రతకు, సార్వభౌమత్వానికి అడ్డంకిగా మారకూడదని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.