సిద్ధూ నుంచి దేశాన్ని కాపాడతా.. ఎంత‌టి త్యాగానికైనా సిద్ధం

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ లాంటి ప్రమాద‌కారి నుంచి దేశాన్ని కాపాడ‌టం కోసం తాను ఎంత‌టి త్యాగానికైనా సిద్ధ‌మ‌ని పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ స్పష్టం చేశారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌ని సిద్ధూ ఆశ‌ప‌డుతున్నాడ‌ని, కానీ ఆ ప్రమాద‌క‌ర‌మైన వ్యక్తి అంత‌టి ఉన్న‌త‌మైన ప‌ద‌విలోకి రాకుండా తాను అన్ని విధాలా అడ్డ‌కుంటాన‌ని ఆయ‌న వెల్లడించారు. 

సిద్ధూను ఎమ్మెల్యేగా కూడా గెలువ‌కుండా చేయ‌డానికి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అత‌నిపై గ‌ట్టి అభ్య‌ర్థిని నిల‌బెడుతాన‌ని అమ‌రీంద‌ర్ ప్రకటించారు.  అతడ్ని నమ్ముకుని ఎన్నికలకు పోతే కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పది సీట్లు కూడా రావని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘సిద్దూ పంజాబ్‌కు ప్రమాదం’’ అంటూ తీవ్రమైన హెచ్చరిక కూడా అమరీందర్ చేశారు.

సోనియాగాంధీకి తాను మూడు వారాల క్రిత‌మే రాజీనామా లేఖ పంపించాన‌ని, ఆమె త‌న‌ను పిలిచి సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకొమ్మ‌ని చెబితే గౌర‌వంగా ఉండేద‌ని ఆయ‌న వాపోయారు.

‘‘వాళ్లు దిగిపొమ్మన్నారు, నేను దిగిపోయాను. ఒక సైనికుడిగా నా పని ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు’’ అన్న అమరీందర్ ఇంకా మాట్లాడుతూ ‘‘ఎమ్మెల్యేల్ని విమానాల్లో గోవాకు తీసుకెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాకు అలాంటివి తెలియవు. గమ్మిక్కిలు, అడ్డదారుల్లో నేను వెళ్లను. గాంధీ వారసులకు నా విధానం ఏంటో తెలుసు. కాకపోతే రాహుల్, ప్రియాంకలకు అంతగా అనుభవం లేదు. సలహాదారులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని విచారం వ్యక్తం చేశారు.

ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీ త‌న పిల్ల‌ల లాంటి వార‌ని, తన‌ను ఇంత అవ‌మాన‌క‌రంగా ప‌ద‌వి నుంచి తొల‌గించి ఉండాల్సింది కాద‌ని, త‌న తొల‌గింపున‌కు పార్టీ అనుస‌రించిన వ్యూహం త‌న‌ను చాలా బాధ‌పెట్టింద‌ని అమ‌రీంద‌ర్‌సింగ్ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. రాహుల్‌, ప్రియాంక‌ల‌కు త‌న గురించి బాగా తెలుస‌ని పేర్కొంటూ వారి వెంట ఉన్న కొంతమంది వారికి త‌ప్పుడు స‌ల‌హాలు ఇచ్చార‌ని ధ్వజమెత్తారు.