సిద్దు `దేశ ద్రోహి’ ఆరోపణపై సోనియాను ప్రశ్నించిన బీజేపీ

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దుకు పాకిస్థాన్ నేతలతో సంబంధాలు ఉన్నాయని, అతను `దేశ ద్రోహి’ అని, అతనితో దేశ భద్రతకు ప్రమాదం నెలకొన్నదని పంజాబ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన కెప్టెన్ అమరిందర్ సింగ్ చేసిన ఆరోపణపై కాంగ్రెస్ అధిష్ఠానం వివరణ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది.

ఈ ఆరోపణలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు మౌనంగా ఉందని సీనియర్ బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు.  దీనిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ స్పందిస్తుందా? చర్యలు తీసుకుంటుందా? అని అడిగారు.

కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పార్టీ (కాంగ్రెస్) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూను దేశ వ్యతిరేకి అనడం చాలా తీవ్రమైన ఆరోపణ అని ఆయన చెప్పారు. దీనిపై కాంగ్రెస్ మాట్లాడాలని, తమ వాదనను వినిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటుందా? చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. 

సిద్దు దేశ భద్రతకు  అయితే ఒక సరిహద్దు రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అతనిని సోనియా గాంధీ, రాహుల్ గాంథిలతో సహా కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు మద్దతు ఇస్తున్నదని బిజెపి ప్రధాన కార్యదర్శి తరుణ్ చూగ్ నిలదీశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తమపై పడిన అపవాదును తొలగించుకోవలసిందే అని స్పష్టం చేశారు. 

ఇలా ఉండగా,  గాంధీల కంటే అమరిందర్ సింగ్‌కే ఎక్కువ పాపులారిటీ ఉందని ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎద్దేవా చేశారు.  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కంటే అమరిందర్‌కు పాపులారిటీ ఎక్కువగా పెరుగుతుండటంతోనే ఆయనను తొలగించారని ఆరోపించారు.