న్యాయవ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాలి

 
భారత న్యాయవ్యవస్థను సాధ్యమైనంత త్వరగా దేశ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించేలా మార్చాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్‌ రమణ పిలుపిచ్చారు. ప్రస్తుత న్యాయవ్యవస్థ, నిబంధనలు, కోర్టుల్లో విచారణ విధానంలో బ్రిటన్‌ మూలాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో ఉన్న వైవిధ్యానికి ఈ తరహా వ్యవస్థలు సరిపోవని ఆయన స్పష్టం చేశారు. 
ఏప్రిల్‌ 25న కన్నుమూసినసుప్రీంకోర్టు దివంగత న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతను గౌడర్‌కు నివాళి అర్పించేందుకు కర్నాటక బార్ కౌన్సిల్  బెంగళూరులో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ సమాజంలో వాస్తవ పరిస్థితలుకు అనుగుణంగా న్యాయవ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. 
న్యాయం కోసం ఆశ్రయించిన ‘పిటిషనర్‌ కేంద్రంగా’నే కోర్టులు పనిచేయాలని స్పష్టం చేశారు. సమాజంలోని ఆచరణాత్మక వాస్తవాలకు, స్థానిక అవసరాలకు అనుగుణంగా న్యాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ రోజుల్లో కోర్టు తీర్పులు రావడానికి చాలా ఆలస్యం అవుతోందని, దీనివల్ల కక్షిదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతోందని జస్టిస్ ఎన్‌వి రమణ తెలిపారు.
సామాన్య మానవుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు కోర్టులు, న్యాయమూర్తులను చూసి భయపడే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. కక్షిదారు నిజం చెప్పగలిగేలా కోర్టు వాతావరణాన్ని సౌకర్యవంతం చేయాలిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులదేనని ఆయన సూచించారు. న్యాయాన్ని ప్రజలకు చేరువ చేయడం సహా దాన్ని మరింత సమర్థంగా అందించడం చాలా కీలకమని పేర్కొన్నారు. న్యాయస్థానాలు కక్షిదారు కేంద్రంగా పని చేయాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.
మధ్యవర్తిత్వం ద్వారా న్యాయవ్యవస్థ వనరులను ఆదా చేయవచ్చని, కోర్టుల్లో పెండింగ్‌ కేసులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. శంతనగౌడర్‌ ‘అసాధారణ జడ్జి’ అని జస్టిస్‌ రమణ గుర్తుచేసుకొన్నారు. ఆయన ‘సామాన్యుల జడ్జి’ అని, దేశం ఆయన సేవలను కోల్పోయిందని పేర్కొన్నారు. శంతనగౌడర్‌ 1958 మే 5న కర్ణాటకలో జన్మించారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2023 మే 5 వరకు ఆయన పదవిలో కొనసాగాల్సి ఉంది.