సిద్ధూ దేశ ద్రోహి … అతనితో దేశ భద్రతకు ముప్పు

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ దేశ ద్రోహి అని, అతనితో దేశ భద్రతకు ముప్పు  వాటిల్లుతుందని   పంజాబ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ హెచ్చరించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తే తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని హెచ్చరించారు. 

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్‌తో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తనకు తెలుసని వెల్లడించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అతడికి స్నేహితులు అని గుర్తు చేశారు. “నిత్యం మన సైనికులను వారు చంపుతున్నారు. సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్నారు. అటువంటి సమయంలో మంత్రిగా సిద్దు పాకిస్థాన్ వెళ్లడాన్ని నేను వ్యతిరేకించాను” అని తెలిపారు.

పైగా, నవజోత్‌ సింగ్ సిద్ధూ ఒక అసమర్థుడని, పార్టీకి పట్టిన దారిద్రమని ధ్వజమెత్తారు. ఒకే ఒక్క మంత్రిత్వశాఖను నిర్వహించలేని సిద్ధూ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు? అని ప్రశ్నించారు.

నిత్యం చాలా డ్రోన్లు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, బాంబులు, తుపాకులు, రైఫిల్స్, ఎకె 47 తుపాకులు, ఆర్ డి ఎక్స్,  హీరోయిన్ లు  (పంజాబ్‌లో) వస్తున్నాయిని పేర్కొన్నారు. వారం రోజుల క్రితమే తాను ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రిని కలసి పాకిస్థాన్ ఆయుధాలు జారవిడుస్తున్న డ్రోన్ లను ఎదుర్కొనే పరికరాలను పంపమని అడిగానని ఆయన తెలిపారు.

అయితే తాను రాజకీయ సమాలోచనలు వెళ్లిన్నట్లు కొందరు వదంతులు పుట్టించారని పరోక్షంగా సిద్దును ఉద్దేశిస్తూ ఆరోపించారు. తాను ఢిల్లీకి వెళ్లనని, తరచుగా వెళ్లేవాళ్లు అక్కడ పార్టీ హైకమాండ్‌తో ఏమి చెప్తున్నారో తనకు తెలియదని అంటూ సిద్దు చెప్పుడు మాటల ప్రభావానికి కాంగ్రెస్ అధిష్ఠానం లోనైన్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్ నుండి పంజాబ్ కు గల ఉగ్రవాద ముప్పు గురించిన సమాచారం కేంద్ర నిఘా వర్గాల వద్ద, పంజాబ్ పోలీస్ వద్ద ఉన్నదని అంటూ, దేశ భద్రత అంశాలలో కేంద్ర, రాష్ట్రాలు కలసి పనిచేయవలసి ఉన్నదని చెప్పారు.  పంజాబ్ కు పాకిస్తాన్‌తో గల 600 కిలోమీటర్ల సరిహద్దు కేవలం రాష్ట్రానికి సంబంధించి అంశమే కాదని, అది దేశ భద్రతకు సంబంధించిన విషయని మాజీ సైనికుడైన అమరిందర్ సింగ్ స్పష్టం చేశారు.

కొత్త సీఎం సోనియా నిర్ణయానికే 

కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్తగా ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నిర్ణయిస్తారని సీఎల్పీ (కాంగ్రెస్ శాసన సభాపక్షం) తీర్మానం చేసింది. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ హరీశ్ రావత్ నేతృత్వంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారు.

కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా అందించిన సేవలకు ధన్యవాద తీర్మానం చేశామని,  ఇక రెండో తీర్మానం కొత్త సీఎం ఎంపికపై చేసినట్లు రావత్ చెప్పారు. శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకునే అంశాన్ని సోనియా గాంధీ చేతుల్లో పెట్టామని, ఆమె ఎవరిని ఎన్నుకుంటే ఆ వ్యక్తే సీఎం అవుతారని తెలిపారు. కొత్త సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై ప్రత్యేకించి ఎటువంటి చర్చ ఈ సమావేశంలో జరగలేదని పంజాబ్ కాంగ్రెస్ పరిశీలకుడిగా వచ్చిన సీనియర్ నేత అజయ్ మాకెన్‌ చెప్పారు.