పంజాబ్ కొత్త సీఎంగా చ‌ర‌ణ్‌జిత్

పంజాబ్ రాష్ట్ర నూత‌న సీఎంగా చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఇంత‌కుముందు సుఖ్‌జింద‌ర్ సింగ్‌ ర‌ణ్‌ద‌వా కొత్త పంజాబ్ సీఎంగా ఎంపిక చేసిన‌ట్లు అఖిల భార‌త కాంగ్రెస్ (ఏఐసీసీ) ఓ ప్ర‌క‌ట‌న చేసింది. కానీ త‌ర్వాత మారిన ప‌రిస్థితుల్లో చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీని ఎంపిక చేసిన‌ట్లు ఆదివారం సాయంత్రం మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది.

 పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చరంజిత్ సింగ్ చన్నీ అని ఆదివారం సాయంత్రం పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ హరీష్ రావత్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆదివారం ఆయన పంజాబ్ అసెంబ్లీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు.

త‌న‌ను అవ‌మానిస్తున్నారంటూ కెప్టెన్ అమ‌రింద‌ర్ సింగ్ శనివారం సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీ ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. పంజాబ్ కు తొలి దళిత్ ముఖ్యమంత్రి కానున్నారు.  సుఖ్‌జింద‌ర్ సింగ్ ర‌ణ్‌ద‌వా పేరును నూత‌న సీఎంగా ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించినా పీసీసీ అధ్య‌క్షుడు న‌వ్‌జ్యోతి సింగ్ సిద్ధూ ఢిల్లీకి వెళ్ల‌డంతో కాంగ్రెస్ అధిష్ఠానం వైఖ‌రి మారిన‌ట్లు తెలుస్తున్న‌ది. 

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దుతో కలసి 2017 ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని అమరిందర్ సింగ్ పై  తిరుగుబాటు చేసిన మంత్రులలో చ‌ర‌ణ్‌జిత్ కూడా ఉన్నారు. అమరిందర్ సింగ్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన అకాలీదళ్- బిజెపి ప్రభుత్వం సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరు అంతగా ప్రచారంలోకి రాకపోయినా, ఆయనను కానీ, ఆయన అనుయాయులను కానీ సీఎంగా ప్రకటిస్తే అసెంబ్లీలో బలపరీక్షకు కెప్టెన్ అమరీందర్ డిమాండ్ చేసే అవకాశాలను కూడా అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. 

ఈ క్రమంలో సిక్కు నేత, క్యాబినెట్ మంత్రిగా ఉన్న సుక్జిందర్ సింగ్ రంధావా వైపే అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. మాజీ  ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జక్కర్ ముఖ్యమంత్రి కాగలరని మొదట్లో  కధనాలు వెలువడిన పంజాబ్ లోని కాంగ్రెస్ ఎంపీలు ఆయన పేరును వ్యతిరేకించినట్లు తెలిసింది.

మరోవంక,పంజాబ్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని పార్టీ హైక‌మాండ్ త‌నకు ఆఫ‌ర్ చేసిందని, అయితే ఆ ఆఫ‌ర్‌ను తాను అంగీక‌రించ‌లేద‌ని  కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు, ఎంపీ అంబికాసోనీ   చెప్పారు. అంతేగాక పంజాబ్‌కు సిక్కు సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తే ముఖ్య‌మంత్రిగా ఉంటే బాగుంటుంద‌ని ఆమె సూచించారు.