అమెరికా-ఆస్ట్రేలియా సబ్ మెరైన్ డీల్ పై ఫ్రాన్స్ మండిపాటు 

తమతో చేసుకున్న 90 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల(66 బిలియన్ల అమెరికన్ డాలర్ల) జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందాన్ని ఆస్ట్రేలియా రద్దు చేసుకోవడం పట్ల ఫ్రాన్స్ ఘాటుగా స్పందించింది. అమెరికా తయారీ అణు జలాంతర్గాముల కోసం తాజాగా ఆస్ట్రేలియా మరో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఆ రెండు దేశాల నుంచి తమ రాయబారులను తక్షణమే వెనక్కి పిలిపిస్తున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. 
 
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, యుకె కూటమిగా ఏర్పాటైన నేపథ్యంలో ఫ్రాన్స్‌తో 2016లో 12 డీజిల్‌ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ల కొనుగోలుకు జరిగిన ఒప్పందాన్ని ఆస్ట్రేలియా రద్దు చేసుకోవడం వివాదానికి కారణమైంది. అయిదేళ్ల క్రితం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాదని, అమెరికాతో ఆస్ట్రేలియా వెళ్లడంపై ఫ్రాన్స్‌ ఆగ్రహంతో రగులుతోంది.
ఇది తమను వెన్నుపోటు పొడవడమేనని ఫ్రాన్స్ మండిపడింది.  అమెరికా, ఆస్ట్రేలియా వ్యవహరించిన తీరు తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జేన్‌ యేస్‌ లీ డ్రియాన్‌ స్పష్టం చేశారు.  అమెరికన్‌ టెక్నాలజీతో నిర్మించిన అణు ఇంధన సబ్‌మెరైన్ల కొనుగోలు కోసం ఫ్రెంచ్‌ సబ్‌మెరైన్ల కంపెనీతో గతంలో కుదుర్చుకున్న భారీ కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం తాలూకు పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని లీ డ్రియాన్‌ హెచ్చరించారు.
డీజిల్‌ సబ్‌మెరైన్స్‌ ఒప్పందం రద్దు వల్ల ఫ్రాన్స్‌ అతి పెద్ద కాంట్రాక్టును కోల్పోయింది. ఆస్ట్రేలియా చాలా పెద్ద తప్పు చేసిందని ఈ సందర్భంగా ఆ దేశంలోని ఫ్రాన్స్ రాయబారి జీన్‌పెర్రే థేబాల్ట్ విమర్శించారు. భాగస్వామ్య దేశంతో ఆస్ట్రేలియా చాలా చెడ్డగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. ఆస్ట్రేలియాతో తమ దేశానికి జరిగిన ఒప్పందాన్ని నమ్మకానికి, పరస్పర అవగాహనకు గుర్తుగా భావించామని ఆయన పేర్కొన్నారు.
 
పారిస్ నుంచి ప్రకటన వెలువడిన 17 గంటల్లోనే ఆస్ట్రేలియా నుంచి దోహా (కతార్) మీదుగా విమానంలో తమ దేశానికి థేబాల్ట్ బయలుదేరారు. ఫ్రాన్స్‌ ప్రకటనపై అమెరికా విదేశాంగ శాఖ కానీ, వైట్‌హౌస్‌ కానీ ఎలాంటి స్పందన రాలేదు. అయితే, 2016లో ఫ్రాన్స్‌ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద డీజిల్‌ ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన్స్‌ ఓ పన్నెండింటిని కొనుగోలు చేసేందుకు 5,600 కోట్ల ఆస్ట్రేలియన్‌ డాలర్ల (4,300 కోట్ల అమెరికన్‌ డాలర్లు) విలువైన ఒప్పందం కుదుర్చుకున్న మాట నిజమే అని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌
 
అయితే ఆ ఒప్పందం కుదుర్చుకునే సమయానికి అమెరికా అణు సబ్‌మెరైన్‌ టెక్నాలజీ తమకు అందుబాటులో లేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. జలాంతర్గాముల సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు అమెరికా అణు సబ్‌మెరైన్లవైపు మొగ్గామని మోరిసన్‌ తన చర్యను సమర్థించుకున్నారు. అణు సబ్‌మెరైన్‌ టెక్నాలజీని అమెరికా ఇంతవరకు ఒక్క బ్రిటన్‌తోనే పంచుకుంది. ఇప్పుడు కాన్‌బెర్రా అణు సబ్‌మెరైన్ల తయారీకి అమెరికా, బ్రిటన్‌ ఏమేరకు సహకారమందిస్తాయో చూడాలి. అమెరికా వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ఫ్రాన్స్‌ నాటో నుంచి వైదొలగుతానన్న సంకేతాలు ఇచ్చింది.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జోయ్ బిడెన్ ఇప్పటి వరకు వ్యాఖ్యానించక పోయినప్పటికీ ఈ విషయమై ఫ్రెంచ్ అధికారులతో బిడెన్ ప్రభుత్వం సన్నిహితంగా ఉందని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఎమిలీ హార్న్ తెలిపారు. “మేము వారి పరిస్థితిని అర్థం చేసుకున్నాము. మా సుదీర్ఘ మైత్రి సమయంలో మేము ఇతర అంశాలలో చేసినట్లుగా, మా విభేదాలను పరిష్కరించుకోవడానికి రాబోయే రోజుల్లో నిమగ్నమై ఉంటాము” అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
“ఫ్రాన్స్ మా పాత మిత్రుడు. ఒకరు మా బలమైన భాగస్వాములు.  మేము భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువలు. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి కలిసి పనిచేయడానికి ఒక నిబద్ధతను పంచుకుంటాము” అని ఆమె పేర్కొన్నారు. .