ప్ర‌ధాని మోదీని ఆహ్వానించిన చిన‌జీయ‌ర్ స్వామి

భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్దీ ఉత్సవాలకు, స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు హాజ‌రు కావాలంటూ ప్ర‌ధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిసి త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి ఆహ్వానించారు. సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను మోదీకి చిన‌జీయ‌ర్ స్వామి వివరించారు. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. 

మైహోం గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు మోదీకి రామానుజ ప్రాజెక్టు వివరాల‌ను తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. సమతాస్ఫూర్తి కేంద్రం విశిష్టతను, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేసిన‌ 216 అడుగుల రామానుజాచార్య పంచలో విగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను మోదీ ఆస‌క్తిగా తెలుసుకున్నారు.

ప్రపంచ శాంతి కోసం చిన్న జీయర్ స్వామి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించిన ప్రధాని మోదీ.. విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని హామీ ఇచ్చారు. గడిచిన ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటించిన త్రిదండి చిన్న జీయర్‌ స్వామి దేశ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు.

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మంగళవారం కలిసిన చిన్నజీయర్‌ స్వామి సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఆత్మీయంగా ఆహ్వానించారు. రామానుజాచార్య విగ్రహ విశేషాలను.. ఏర్పాటు చేయడానికి గల కారణాలను రాష్ట్రపతికి వివరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని రాష్ట్ర‌ప‌తి హామీ ఇచ్చారు.

రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గ‌డ్క‌రీ, కిష‌న్ రెడ్డి, అశ్విన్‌ చూబె, భూపేంద్ర యాద‌వ్‌తో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను క‌లిసి రామానుజ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి చిన్నజీయర్ స్వామి ఆహ్వానించారు. 

అనేక విశిష్టలతో నిర్మితమవుతున్న సమతాస్ఫూర్తి కేంద్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. రూ. వెయ్యి కోట్లతో మొత్తం 200 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న స్టాట్చ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీని 216 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రామానుజాచార్యలు విగ్రహాన్ని108 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు.

భద్రవేది ఎత్తు 54 ఫీట్లు, పద్మపీఠం 27 ఫీట్లు, త్రిదండం 135 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇక భద్రవేదిలో 54 పద్మాలను ఏర్పాటు చేశారు. స్టాట్చ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ పద్మం కింద 36 ఏనుగులను ఏర్పాటు చేశారు. 18 శంఖు, 18 చక్రాలతో మొత్తం 36 శంకుచక్రాలను ఏర్పాటు చేశారు.

ఇక రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ, వేదాల సారాన్ని అందించే గ్రంథాల లైబ్రరీ, పండిత సభల కోసం ఆడిటోరియం, వివిధ ప్రదర్శనల కోసం ఓమ్నిమాక్స్‌ థియేటర్‌ను కూడా నిర్మిస్తున్నారు. అంత పెద్ద రామానుజచార్యుల విగ్రహానికి అభిషేకం నిర్వహించడం కష్టతరం కాబట్టి ప్రత్యేకంగా బంగారంతో రూపొందించిన రామానుజచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 120 కేజీల బంగారంతో దీనిని తీర్చిదిద్దారు.