పరాభవంతో పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ రాజీనామా

పార్టీ అధిష్ఠానం తన పట్ల వ్యవహరించిన తీరుపట్ల పరాభవంతో పంజాబ్  ముఖ్యమంత్రి పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ త‌న ప‌ద‌వి రాజీనామా చేశారు.  ఆయన గవర్నర్‌ భన్వరీలాల్ పురోహిత్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశాన్ని జరుపుతున్నట్లు గత అర్ధరాత్రి పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి హరీశ్ రావత్ ప్రకటించడం పట్ల ఆయన ఆగ్రహం చెందిన్నట్లు తెలుస్తున్నది. ఈ మధ్య కాలంలోనే వరుసగా మూడు సార్లు శాసనసభ పక్ష సమావేశం జరిగినదని, అంత అర్ధాంతరంగా జరపవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. 

ఇలాంటి అవ‌మానాల‌తో పార్టీలో కొన‌సాగ‌లేన‌ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఈ ఉదయమే చెప్పిన‌ట్లు ఆయన తెలిపారు. “మీ పిల్లలు ఇద్దరు నా ప్రభుత్వాన్ని అస్థిర పరచే పరయత్నాలు చేస్తున్నారు” అంటూ ఆయన నేరుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వ్యవహారశైలిపై ఈ సందర్భంగా ఆమెకు ఫిర్యాదు చేసిన్నట్లు తెలుస్తున్నది.  

దేశం కోసం, పంజాబ్ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం తన సర్వశక్తులు ధారపోసి కృషి చేస్తున్న తన వంటి సీనియర్ పట్ల వ్యవహరించ వలసిన తీరు ఇదికాదని ఆయన నిర్మోహాటంగా స్పష్టం చేశారు.

మూడ‌వ సారి త‌న‌ను అవ‌మానించిన‌ట్లు పేర్కొంటూ  రాజీనామా చేయాల‌ని ఇవాళ ఉద‌య‌మే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. పార్టీ అధిష్ఠానంపై నమ్మకం ఉన్నవారిని ముఖ్యమంత్రిగా చేసుకోమని నిష్టూరంగా మారారు. అయితే రాజకీయ భవిష్యత్ గురించి తనకు ఆలోచనలు ఉన్నాయని, ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినా రాజకీయాలలో కొనసాగుతానని వెల్లడించారు. 

మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. వచ్చే ఏడు ఎన్నికలు జరుగనున్న ఏడు రాష్ట్రాలలో కాంగ్రెస్ తప్పనిసరిగ్గా గెలువగలిగింది పంజాబ్ ఒక్కటే అని పలు వర్గాలు భావిస్తున్న తరుణంలో ఈ పరిణామం ఆ పార్టీ భవిష్యత్ ను సవాల్ మయం కావిస్తున్నది. 

తొలుత పదేళ్ల పాటు సైన్యంలో పనిచేసిన ఆయన 52 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నారు. పంజాబ్ లో రెండు సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కారణమయ్యారు. తన మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత తన రాజకీయ భవిష్యత్ వెల్లడిస్తానని ప్రకటించారు. 

రాజకీయాలలోకి వచ్చిన క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దును అమరిందర్ సింగ్ అభిష్టంకు విరుద్ధంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించినప్పటి నుండి పంజాబ్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు తీవ్రతరం అవుతున్నాయి. సిద్దు పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన పార్టీ ప్రభుత్వం పనితీరు పట్ల బహిరంగంగా విమర్శలు చేస్తున్నా పార్టీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదు. 

సిద్దును ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించినప్పటి నుండి ముఖ్యమంత్రిని మార్చాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రయత్నాలు ప్రారంభించారని కధనాలు వెలువడుతున్నాయి. వారి మద్దతుతోనే  గత నెలలో నలుగురు మంత్రులు, దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కెప్టెన్ సింగ్‌కు వ్యతిరేకంగా కొద్దీ కాలంగా గళం ఎత్తుతున్నారు.