కర్ణాటకలో కొలువుదీరిన శివకుమార్ ప్రభుత్వం

కర్ణాటకలో కొలువుదీరిన శివకుమార్ ప్రభుత్వం
 
కర్ణాటక  34వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌తో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. బుధవారం సాయంత్రం బెంగళూరులోని లోక్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. డీకే ప్రమాణస్వీకార వేడుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కేరళ, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు వీడీ సతీశన్, రేవంత్ రెడ్డి, సుఖ్విందర్ సింగ్ సుఖు తదితరులు హాజరయ్యారు. 

రాజ్యాంగాన్ని చేతితో పట్టుకుని డీకే ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు వేదికపై నుంచి ప్రజలకు ఆయన సాష్టాంగ నమస్కారం చేయడం విశేషం. గత వారం ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగిన సిద్ధరామయ్యతో సుదీర్ఘకాలం సాగిన అధికార పోరు అనంతరం, రాష్ట్ర అత్యున్నత రాజకీయ పదవిని అధిరోహించడం ద్వారా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.

ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా జి.పరమేశ్వర ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా సిద్ధరామయ్య తనయుడు యత్రీంద్ర, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే,కేహెచ్‌ మునియప్ప, కె.జె.జార్జ్‌, ఎంబీ పాటిల్‌, సతీశ్‌ జర్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణబైరి గౌడ, మాజీ స్పీకర్ యు.టి.ఖాదిర్‌, ఈశ్వర్‌ ఖండ్రే, బైరతి సురేశ్‌, శరణ్‌ ప్రకాశ్‌ పాటిల్‌తో గవర్నర్ ప్రమాణం చేయించారు. రాజ్యసభ ఎన్నికల అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, అధికారం చేపట్టింది. అయితే, ఆ సమయంలోనే ముఖ్యమంత్రి  పదవి కోసం డీకే తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, సీనియర్ నేత సిద్ధరామయ్యకు అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత అవకాశం కల్పిస్తామని అప్పట్లో హైకమాండ్ మాట ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. గతేడాది నవంబరుతో సగం కాలం పూర్తికాగా, నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ జరిగింది. కానీ, తాత్కాలికంగా ఆ సంక్షోభాన్ని నివారించిన కాంగ్రెస్ పెద్దలు చివరకు సిద్ధరామయ్యను ఒప్పించి రాజీనామా చేయించారు.