జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఎలాంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని ప్రాంతానికి `విహార యాత్ర’కు బయలుదేరడం రాజకీయ దుమారం రేపుతోంది. బుధవారం అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గుప్కర్ రోడ్డులోని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రైవేట్ కార్యాలయానికి చేరుకున్నారు.
అక్కడ సిద్ధంగా ఉన్న బస్సుల్లోకి వారు ఎక్కారు. అయితే వారికి ఏమాత్రం తెలియని గమ్యస్థానమైన దాచిగామ్ జాతీయ పార్కుకు ఆ బృందం బయలుదేరింది. పార్టీ నేతలతో కలిసి బస్సు వెనుక సీటులో కూర్చున్న సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 19 నెలల తన ప్రభుత్వ పనితీరును సమీక్షించడమే ఈ ప్రత్యేక సమావేశం లక్ష్యమని తెలిపారు.
‘ఆఫ్-సైట్’ మీటింగ్ అని అభివర్ణించారు. ‘గడిచిన 19 నెలల్లో జరిగిన మంచి, అంత మంచి కాని, ఇంకా వాటి మధ్య ఉన్న అన్ని విషయాలను సమీక్షించుకోవడానికి మేం ఒక బయటి కార్యక్రమానికి బయలుదేరుతున్నాం’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర హోదా పునరుద్ధరణలో జాప్యం, పరిస్థితిని మార్చడానికి ఒమర్ అబ్దుల్లా పెద్దగా ఏమీ చేయడం లేదని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోవడంపై ఆ పార్టీ నేతల్లో నిరాశ పెరుగుతున్నది.
ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా తన భవిష్యత్ వ్యూహాన్ని చర్చించడానికి దాచిగామ్ జాతీయ పార్కుకు వారిని తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. కాగా, 2024 అక్టోబర్‌లో జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ అజెండాను కొనసాగించడంలో పార్టీ విఫలం కావడంపై కొంతమంది ఎన్సీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చెందిన శ్రీనగర్ ఎంపీ అగా రుహొల్లా బహిరంగంగా ఒమర్ అబ్దుల్లాను విమర్శించారు.
ప్రజా తీర్పును ఆయన మోసం చేశారని ఆరోపించారు. ‘క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నాటి పర్యటనకు రుహొల్లాకు ఆహ్వానం అందలేదు. అయితే అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ కుప్పకూలవచ్చని ప్రతిపక్ష బీజేపీ, పీడీపీలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇంకా తనతో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఒమర్ అబ్దుల్లా ఈ యాత్ర నిర్వహించారని, ఇది ఆయనకు ఫ్లోర్ టెస్ట్ అని జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన బీజేపీ నేత సునీల్ శర్మ ఎద్దేవా చేశారు.

More Stories
కోల్‌కతా కాలేజీ గదుల్లో రూ 1 కోటి నగదు, గన్, బెడ్స్, కండోమ్స్
రెబల్ టిఎంసి ఎమ్మెల్యేను ప్రతిపక్ష నేతగా గుర్తించిన స్పీకర్
కర్ణాటకలో కొలువుదీరిన శివకుమార్ ప్రభుత్వం