ప్రజల మధ్యకు గవర్నర్, ఫార్మ్ హౌస్ లోనే కేసీఆర్!

క్రియాశీల రాజకీయాల నుండి రాజభవన్ కు వచ్చిన తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందర్య రాజన్ రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొని మూడో  సంవత్సరంలో ప్రవేశించగా, ఆమె క్రియాశీలత కేసీఆర్ ప్రభుత్వాన్ని పలు సందర్భాలలో ఇరకాటంలో పడవేస్తున్నట్లు కనిపిస్తున్నది. 
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అంతకు ముందు యుపిఎ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంపై నియమితులైన నరసింహన్ ఐదేళ్లపాటు కొనసాగారు. ఆయనతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు మంచి సంబంధాలు ఉండెడివి. మాజీ పోలీస్ అధికారి కావడంతో ఆయన ఒక విధంగా కేసీఆర్ కు రక్షణ కవచంగా ఉండేవారు. ఈ విషయమై ప్రతిపక్షాలు పలుసార్లు ఆయన పట్ల అసహనం వ్యక్తం చేశాయి కూడా. 
 
కేసీఆర్ ప్రజలకే కాకుండా  మంత్రులు, అధికార పార్టీ ఎమ్యెల్యేలు, ఉన్నతాధికారులకు కుండా అందుబాటులో ఉండరు. ఆయనను కలవడం అంత తేలిక కాదు. సచివాలయంకు కూడా  రాకుండా, ఎక్కువగా ఫార్మ్ హౌస్ లోనే గడుపుతున్నారు. కానీ డా. తమిళిసై అందరికి అందుబాటులో ఉంటున్నారు. తెలంగాణ `విముక్తి దినం’ సందర్భంగా రాష్ట్ర  ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపాదం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారినట్లు పలువురు భావిస్తున్నారు. 
 
కేసీఆర్ ఈ సందర్భంగా మౌనంగా ఉండడం,  అధికారికంగా ప్రభుత్వం జరపాలని బిజెపి డిమాండ్  చేస్తున్నా పట్టించుకొనక పోవడం చేస్తున్నారు. పైగా `విముక్తి దినం’గా గుర్తించడానికి కూడా విముఖంగా ఉంటూ, కేవలం `విలీన దినం’గా మాత్రమే చెబుతున్నారు. 
 
తాజాగా గవర్నర్ `ప్రజా దర్భార్’ జరిపి ప్రజల నుండి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించడానికి గవర్నర్ సన్నాహాలు చేస్తుండడం ప్రభుత్వానికి కలవరం కలిగిస్తున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు అందుబాటులో లేకుండా గవర్నర్ ప్రజలకు చేరువకావడం రాజకీయంగా ఇరకాటంలో పడవేయవచ్చని భావిస్తున్నారు. 
 
తాజాగా హుజురాబాద్ నుండి ఎమ్యెల్యేగా పోటీ చేయడం కోసం కాంగ్రెస్ నుండి ఫిరాయించిన కౌశిక్ రెడ్డికి పార్టీ సీట్ ఇవ్వకుండా గవర్నర్ కోటా నుండి నామినేట్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు మంత్రివర్గం సిఫార్సు చేసినా, ఆమోదం తెలపకుండా తనకు అభ్యంతరం ఉన్నట్లు గవర్నర్ ప్రకటించారు. 
 
వివిధ రంగాలలో ప్రముఖులను నామినేట్ చేయవలసి ఉండగా, కౌశిక్ రెడ్డి ఏ రంగంలో ప్రముఖుడు? అంటూ ఆమె ప్రశ్న లేవనెత్తడంతో కేసీఆర్ ప్రభుత్వం నిస్సహాయంగా ఉండిపోయింది. 
 
ఇప్పటి వరకు ఏ గవర్నర్ చేయని విధంగా ప్రజలకు చేరువ కావడానికి గవర్నర్ పలు వినూత్న ఆలోచనలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. కరోనా మహమ్మారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా ముభావంగా వ్యవహరిస్తే, ఆమె స్వయంగా వైద్యురాలు కావడంతో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. 

వైరస్‌ వ్యాప్తి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఆరు, ఏడు లేఖలను వ్రాసారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత గురించి నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌నే అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. పరీక్షల సంఖ్య పెంచాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదంటూ ఒక దిశలో తన అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. 

అదే సమయంలో బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించొద్దంటూ గవర్నర్‌ను ఉద్దేశించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే  సైదిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే గవర్నర్‌పై బహిరంగ వ్యాఖ్యానాలు చేయొద్దంటూ టీఆర్ఎస్ అధిష్టానం నుండి సంకేతాలు రావడంతో.. వెంటనే సైదిరెడ్డి తాను చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ అంశంలో గవర్నర్‌కు ప్రతి పక్షాలు సైతం మద్దతు తెలిపాయి.

గిరిజనులకు సంబంధించిన అంశాలలో గవర్నర్ కు విశేష అధికారాలు ఉన్నప్పటికీ గతంలో ఎవ్వరు పట్టించుకొనేవారు కాదు. కానీ తమిళసై గిరిజనులపై ప్రత్యేక చొరవ చూపి, అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆ విధంగా ఆమె చేయడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని  వెల్లడిచేసిన్నట్లు అయింది. నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఫర్ న్యూట్రీషన్ చేసిన సర్వేలో కొండరెడ్ల గర్భిణులకు, పిల్లలకు పోషకాహారం సరిగ్గా అందటం లేదని, సరైన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తవని, సాధారణ ప్రజల్లాగే వారూ ఉండాలని.. జీవనంపై కూడా ఆమె అనేక కార్యక్రమాలు చేశారు.

ఆదిమ తెగలలో పౌష్టికాహార లోపం నివారించేందుకు దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో అవగాహన కార్యక్రమం కూడా గడిచినసారి నిర్వహించారు. దీంతోపాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యూనివర్సిటీల వీసీల నియామకంలో సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలకు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండటం లేదు. కానీ  కాంగ్రెస్, బిజెపి నేతలు తరచూ కలుస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తున్నారు.