కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు `విముక్తి’ దినం కాదా! విలీనమేనా?

తెలంగాణకు విముక్తినిచ్చిన సెప్టెంబర్ 17వ తేదీని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిర్వహించిన తీరును బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి తప్పుబట్టారు. మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రంలను  అందించిన విమోచనోత్సవంగా కాకుండా కేవలం భారతదేశంలో నిజాం సంస్థానం (తెలంగాణ) విలీనం చేసినట్లు భావిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు విలీనోత్సవం నిర్వహించాయని ఆయే ధ్వజమెత్తారు. కాస్త తెలివి ఉన్నవారెవరైనా అలా చేస్తారా అంటూ ఆమె మండిపడ్డారు.

‘‘నిజాంల అరాచక పాలన నుంచి తెలంగాణకు విముక్తినిచ్చిన సెప్టెంబర్ 17వ తేదీని…. మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందించిన విమోచనోత్సవంగా కాకుండా…. కేవలం భారతదేశంలో నిజాం సంస్థానం (తెలంగాణ) విలీనం చేసినట్లు భావిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు విలీనోత్సవం నిర్వహించాయి” అని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. 

స్వాతంత్య్రం  అంటే రాక్షస రజాకార్ల అధికార నియంతృత్వం నుంచి విమోచనమా? లేక కేవలం భారతదేశంలో విలీనమా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఎన్ని మాటలు తిప్పి చెప్పినా… దుష్టుల దుర్మార్గాల నుంచి బయటపడితే విమోచనమే అంటారని విజయశాంతి స్పష్టం చేశారు. 

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ని అల్లకల్లోలం చేస్తున్న తాలిబన్ పాలన నుంచి ఆఫ్ఘన్ ప్రజలు పోరాడి విముక్తులైతే అది విమోచనమౌతుందా?… కాదా?… లేదూ పాకిస్తాన్ లాంటి దేశాల దుష్ప్రచారం ప్రకారం విద్రోహమౌతుందా…? అంటూ ఆమె నిలదీశారు. మతవాద ఎంఐఎం, దాని సయామి ట్విన్  టీఆర్ఎస్ –  ఆ ఇద్దరికి విధాన సమర్ధన ఇస్తున్న తెలంగాణ కాంగ్రెస్ తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రజావ్యతిరేక పాలన, రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి పొందినందుకు సెప్టెంబర్ 17వ తేదీని కాస్త తెలివి ఉన్నవారెవరైనా విమోచనదినంగానే పాటిస్తారని ఆమె చెప్పారు. విచిత్రం ఏమిటంటే… విలీనోత్సవం అంటూ పార్టీ కార్యక్రమంగా మాత్రమే దీనిని నిర్వహిస్తున్న అధికార పార్టీవారికి ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ విమోచనోత్సవాన్ని నిర్వహించడానికి మాత్రం ధైర్యం చాలకపోవడం అంటూ ఆమె ఎద్దేవా చేశారు.