శశిథరూర్‌ను గాడిద అన్న రేవంత్ రెడ్డి!

రాజకీయ ప్రత్యర్థులపై అసభ్య దూషణలు చేయడం భారత రాజకీయాలలో సాధారణంగా మారిపోయింది. అయితే కాంగ్రెస్ లో  శృతిమించి  సొంతపార్టీ నేతలనే దూషిస్తూ ఉండడం సర్వసాధారణం. వేరే పార్టీ వ్యక్తి అని సొంత పార్టీ నేతలు  ఎన్ని  అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతరు చేయకుండా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టిన పార్టీ అధిస్తానంనే ఇరకాటంలో  పెట్టెవిధంగా ఎంపీ రేవంత్ రెడ్డి సహచర పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ ను `గాడిద’ అంటూ కలకలం సృష్టించారు.

 సీనియర్ నేత పైన నోరు పారేసుకోవడంపై అటు రాష్ట్రంలోని పలువురితో పాటు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ సీనియర్ నేతలు చురకలు అంటిస్తున్నారు. శశిథరూర్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడని, ఆయన నీకు, నాకు అలాగే అందరికీ అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి అని సీనియర్ నేత మనీష్ తివారి రేవంత్‌రెడ్డికి గట్టిగానే చివాట్లు పెట్టారు. వెంటనే రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.

మరోవైపు శశిథరూర్ సై తం తనదైన శైలిలో స్పందించారు. బహుశా రేవంత్‌రెడ్డి ఆయన మూ లాలను గుర్తించుకొని గాడిద అనే మాట అన్నారేమో అని ఎద్దేవా చేశారు.  ముప్పేట దాడి ఎదురు కావడంతో తాను మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ మేరకు శశిథరూర్‌తో మాట్లాడానని తెలిపారు. 

శశిథరూర్‌పై తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని చెప్పారు. వంత్‌రెడ్డి తనపై పొరపాటున చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ తనకు ఫోన్ చేయడాన్ని శశిథరూర్ స్వాగతించారు. ఈ దురదృష్టకర ఎపిసోడ్‌కు ఇంతటితో ముగింపు పలుకుతున్నామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ ఇటీవలే హైదరాబాద్ పర్యటించారు.కెటిఆర్ కృషిని ప్రశంసించారు. ఆయన పర్యటనపై  రేవంత్‌రెడ్డికి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ పర్యటనను రేవంత్‌రెడ్డి ముందు ప్రస్తావించగా మండిపడినట్లు ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం శశిథరూర్, కెటిఆర్ ఇద్దరూ ఒకే దుష్టజట్టు అని రేవంత్ విమర్శించారు. ఇరువురికీ ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నంత మాత్రాన మేధావులని భావించనక్కర్లేదని ఎద్దేవా చేశారు. శశిథరూర్ ఒక గాడిద అని, కాంగ్రెస్ ఆయనను బహిష్కరిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

సొంత పార్టీ ఎంపి, ఐటీ స్థాయీ సంఘం చైర్మన్ శశిథరూర్‌నే టిపిసిసి చీఫ్, ఎంపి రేవంత్‌రెడ్డి విమర్శించడాన్ని తెలంగాణ మంత్రి కెటిఆర్ ప్రస్తావిస్తూ ఇలాంటి థర్డ్ రేట్ క్రిమినల్ పార్టీకి సారథ్యం వహిస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఫోరెన్సిక్ పరీక్షకు పంపితే ఓటుకు నోటు కేసులో దొరికిన ఆడియోతో ఇది సరిపోతుందని కెటిఆర్ ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ ఏమైనా స్పందిస్తారా? అని ప్రశ్నించారు.