విమోచన దినం అంటే కేసీఆర్ కు భయం ఎందుకు?

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ రోజుల్లో కేసీఆర్ డిమాండ్ చేశారని కేంద్ర హోమ్ మంత్రి  అమిత్ షా గుర్తు చేసారు. మరిప్పుడు అధికారంలో విమోచనోత్సవాన్ని కేసీఆర్మరిచి  పోయారని ఎద్దేవా చేశారు. అప్పుడిచ్చిన వాగ్దానం ఇప్పుడేమైందని, సీఎం కేసీఆర్‌‌ ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటూ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల వరకూ తెలంగాణకు విముక్తి లభించలేదని, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ పరాక్రమం వల్లే నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణ బయటపడిందని కేంద్ర హోం మంత్రి గుర్తు చేశారు. 
 
అటు మహారాష్ట్రలో విలీనమైన మరాట్వాడా ప్రాంతంలో, కర్ణాటకలో విలీనమైన జిల్లాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినం ఘనంగా జరుపుతుంటే తెలంగాణలో మాత్రమే ఎందుకు జరపడంలేదని అంటూ కేసీఆర్ ను నిలదీశారు.  తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్‌కు పట్టవా? అని ప్రశ్నించారు. ఒక్కసారి బీజేపీకి అధికారమిస్తే.. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 
 
నిర్మల్ ఆదివాసులు మొదట బ్రిటిషర్లు, ఆ తర్వా నిజాంలతో పోరాడారని పేర్కొంటూ తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా విమోచన దినోత్సవ శుభాకాంక్షాలు తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం అరాచకపాలన సంకెళ్లు తెగి తెలంగాణకు విముక్తి లభించి, భారత్‌లో భాగమైందని చెప్పారు. 
 
2024లో బిజెపి ప్రభుత్వం 

అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీకి బీజేపీ భయపడదని అమిత్‌ షా స్పష్టం చేశారు. 2024లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్ముతున్నామని ఆయన భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ గౌరవాన్ని శాశ్వతంగా కాపాడుతామని అమిత్‌ షా చెప్పారు. తెలంగాణకు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన వెల్లడించారు. 

తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని చెబుతూ వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ సీట్లనూ గెల్చుకుంటామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాలేదని పేర్కొంటూ  కాంగ్రెస్ ఓవైసీకి వ్యతిరేకంగా పోరాడలేదని చెప్పారు.

119 నియోజకవర్గాల ప్రజల్లో చైత్యన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెబుతూ ప్రతి ఎన్నికలు డబ్బుతో గెలవొచ్చని టీఆర్‌ఎస్ భావిస్తోందని విమర్శించారు. సేవ చేసేవాడో కావోలో.. డబ్బుల రాజకీయం చేసే వారు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అమిత్ షా ప్రజలకు హితవు చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణలోని సమస్యలు తెలుసుకునేందుకే బండి పాదయాత్ర చేస్తున్నారని ఆయన కొనియాడారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో పాదయాత్ర చేసేవాళ్లను చూశామని పేర్కొంటూ కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం బండి సంజయ్ సంగ్రామ యాత్ర మొదలు పెట్టారని తెలిపారు. 

మజ్లిస్‌‌కు భయపడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోందని, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా.. తెలంగాణ దళితులు, ఆదివాసీలు, మహిళల కోసమే ఈ సంగ్రామ యాత్ర చేస్తున్నామని వివరించారు. మజ్లిస్, టీఆర్‌ఎస్ అధికారంలో లేనప్పుడే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు చెప్పాలని పేర్కొన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను అమిత్ షా పలుకరించారు. నిర్మల్ బహిరంగ సభలో నాయకులను సభకు ఆయన పరిచయం చేసారు. ఈ సందర్భంగా తనకు దూరంగా ఉన్న ఈటల రాజేందర్ ను ముందుకు రావలిసిందిగా ఆయన కోరారు. దీంతో సభంతా మార్మోగింది. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ రాజేందర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని హుజురాబాద్ ప్రజలను ఆయన కోరారు. 
రాష్ట్రంలో రజాకార్ల వారసులుగా ఎంఐఎం నేతలు ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఖాసీం రజ్వీ స్థాపించిన పార్టీనే మజ్లీస్ పార్టీ అని పేర్కొంటూ అదే మజ్లీస్ విమోచన దినం జరపకుండా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇక్కడ అక్బరుద్దీన్ నిర్మల్‌లో హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. అక్బరుద్దీన్ అపవిత్రం చేసిన నిర్మల్‌ను ఇవాళ బీజేపీ పవిత్రం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెబుతూ  కుటుంబ అవినీతి, నియంత పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని స్పష్టం చేశారు. 
 
తెలంగాణలో విమోచన ఉత్సవాలు జరపనందుకు సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.  ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడదామని చెప్పారు. సర్దార్ పటేల్‌ లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేదని స్పష్టం చేశారు. టి ఆర్ ఎస్ కార్యకర్తల్లో తెలంగాణ రక్తం ప్రవహిస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు.  బిజెపి ఎంపీలు సోయం బాబురావు,  డి  అరవింద్,ఎమ్యెల్యేలు రాజాసింగ్, ఎన్ రఘునందనరావు కూడా ప్రసంగించారు.