తెలంగాణా మద్యం దుకాణాల్లో 30 శాతం రేజర్వేషన్లు

మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ నిర్ణయించారు. 

వచ్చే ఏడాది నుంచి రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఈ నెల 24 నుంచి శాసన సభ, మండలి సమావేశాల నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్ది కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని తదుపరి కేబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రిమండలి వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించింది. 

అలాగే కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్అండ్‌బీ, వైద్యారోగ్య శాఖలను ఆదేశాలిచ్చింది.గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, దీన్ని మరింత పెంచి 550 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను కేబినెట్ ఆదేశించింది. 

సమావేశంలో మూడు మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో  మంత్రివ‌ర్గ ఉప‌సంఘంను ఏర్పాటు చేశారు. 

 కొత్త జిల్లాల్లో పోలీస్‌ సేష్టన్ల సమస్యలపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఏర్పాటు చేశారు. హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ నేతృత్వంలో ఏర్పాటైన ఉప‌ సంఘంలో స‌భ్యులుగా హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజ‌య్ సభ్యులుగా ఉన్నారు.

పొడు భూముల సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌ కొనసాగనున్నారు. అలాగే ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి సైతం కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సభ్యులు కొనసాగనున్నారు.

సంగారెడ్డి, ఆంధోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.