మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి

రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. రాబోయే మూడు నెలలూ పండగల సమయం. అలాగే ఫ్లూ కేసులు పెరిగే కాలం గనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ కోరారు. 

ఇప్పటివరకు కరోనా కట్టడిలో సాధించిన ఫలితాలను మరింత మెరుగుపర్చుకుందామని ఆయన ఈ సందర్భంగా కోరారు. దేశవ్యాప్తంగా యువ జనాభాలో ఇప్పటివరకు 20 శాతం మందికి రెండు డోసులు పంపిణీ పూర్తయిందని, అలాగే 62 శాతం మందికి కనీసం ఒక్క డోసు అందినట్లు తెలిపారు. ప్రస్తుత, దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, కేరళలో కూడా కేసుల తగ్గుదల కనబడుతోందని చెప్పారు.

పండగల సీజన్ వస్తుండడంతో వ్యాక్సిన్ తీసుకోవడం, కరోనా నిబంధనలు పాటించడం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడంలాంటివి చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ సూచించారు.  కేరళలో ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని తెలిపారు. పండగల సీజన్‌లో తగు జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కరోనా కేసులుఅకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

దేశంలోని 34 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా ఎక్కువగా ఉండగా, 32 జిల్లాల్లో మాత్రం 5నుంచి 10 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గత వారం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 67.79 శాతం కేసులు ఒక్క కేరళలోనే వచ్చాయని, ప్రస్తుతం అక్కడ 1.99 లక్షల యాక్టివ్ కేసులున్నట్లు వివరించారు. 

మిజోరం, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో 10 వేలకన్నా ఎక్కువ యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. మిజోరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్ త్వరగా జరిగి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితి చక్కబడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

మూడోవేవ్‌ ముప్పు లేనట్టే!

ఇలా ఉండగా, కరోనా మూడోవేవ్‌ ప్రమాదాన్ని వైద్యనిపుణులు తోసిపుచ్చుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో థర్డ్‌వేవ్‌ దశ మొదలవ్వాలంటే ఇప్పుడున్న వైరస్‌ వేరియంట్లు కాకుండా, బలమైన కొత్త స్ట్రెయిన్‌ విశృంఖలంగా వ్యాప్తి చెందాలని.. అప్పుడే మూడో ఉద్ధృతికి అవకాశాలుంటాయని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ తెలిపారు. డెల్టా వేరియంట్‌ తర్వాత ఆ స్థాయి తీవ్రత గల స్ట్రెయిన్‌ను దేశంలో ఇప్పటివరకూ గుర్తించలేదని స్పష్టం చేశారు.

అక్టోబర్‌ మధ్యనాటికి కరోనా థర్డ్‌వేవ్‌ విరుచుకుపడుతుందన్న అంచనాలను తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాసరావు కొట్టిపారేశారు. ఈ వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొన్నారు. ప్రమాదకరమైన కొత్త స్ట్రెయిన్‌ వస్తేనే మూడోవేవ్‌ ప్రమాదం ఉంటుందని చెబుతూ ప్రస్తుతానికి అలాంటి వేరియంట్ల జాడలేదని చెప్పారు.

వచ్చే ఆరు నెలల్లో కొవిడ్‌-19 ఎండెమిక్‌ (కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధి) దశకు చేరుకొంటుందని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ అన్నారు. ఒక వేళ కొత్త వేరియంట్‌ వచ్చినా.. అదొక్కటే మూడో వేవ్‌ను తీసుకురాలేదని పేర్కొన్నారు. పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతీ ఒక్కరికి రెండు డోసుల టీకా వేయడమే తమ ముందున్న అత్యంత ప్రాధాన్య అంశమని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. బూస్టర్‌ డోసు వేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు.