భారత్ రక్షణలో కీలకం హైదరాబాద్ సంస్థానం విమోచనం

దేశంలోని సంస్థానాలు వేటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అవ్వన్నీ బ్రిటిష్ వారి సామంతులుగా పనిచేస్తున్నావే. అవేమి స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. పైగా స్వతంత్ర పోరాటాన్ని అణచివేయడంలో బ్రిటిష్ వారికి అండగా నిలిచాయి. సవంతంత్ర పోరాట సమయంలో సంస్థానాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం గురించిన ప్రస్తావన ఎక్కడా జరగలేదు.
 
అయితే రెండో ప్రపంచ యుద్ధంలో చావుదెబ్బ తిని బయటపడిన బ్రిటిష్ పాలకులు నేతాజీ సుబాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పెద్ద సైన్యం తమపై పోరాటానికి సిద్ధం కావడం, నేతాజీ చనిపోయినా చెల్లాచెదురుగా ఉన్న సైన్యం ఎక్కడ ఒకటి అవుతుందో అన్న భయం వెంటాడటం బయలుదేరింది. ముఖ్యంగా `రెడ్ ఫోర్ట్ ట్రయల్స్’ పేరుతో ఐఎన్ఎ లో పాల్గొన్న యోధులపై విచారణ జరిపి, వారిని శిక్షించే ప్రయత్నం చేస్తుంటే ముంబై సమీపంలో వైమానిక దళంలో తిరుగుబాటు చెలరేగింది.
 
బ్రిటిష్ వారి కింద ఉన్న భారత సైన్యం, నేతాజీ సైన్యం కలిస్తే ఇక్కడ తమ పాలన కొనసాగించడం అసాధ్యం అని గ్రహించారు. అందుకనే ఒక వంక దేశ విభజనకు ఆజ్యం పోయడంతో పాటు దేశంలోని సంస్థానాలను భారత్, పాకిస్థాన్ లలో ఏ దేశంలో అయినా కలసి అవకాశం కల్పించడంతో పాటు, స్వతంత్రంగా మనుగడ సాగించే సౌలభ్యం కూడా కల్పించారు. ఇవ్వన్నీ భారత్ ను బలహీనం చేయడానికి, బ్రిటిష్ వారు లేకుండా ఇక్కడ పాలన సాగించుకోలేరని ఎద్దేవా చేయడం కోసం చేసిన ఎత్తుగడలు మాత్రమే.
 
నాటి ఉప ప్రధాని సర్దార్ పటేల్ పట్టుదల, చాకచక్యంతో 500కు పైగా సంస్థానాలను భారత్ లో విలీనం కావించినా, హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలకులు మాత్రం విలీనం కాకుండా స్వతంత్రంగా కొనసాగే ప్రయత్నం చేశారు. సంస్థానంలోని ప్రజలంతా నిజం అరాచక పాలన నుండి వికుక్తి కోరుకొంటున్నా, నిరసనలను అణచివేస్తూ మాయమాటలతో కాలం గడిపే ప్రయత్నం చేశారు.
 
నిజాంను అడ్డుపెట్టుకొని హైదరాబాద్ ను భారత్ లో విలీనం కాకుండా భారత్ గుండెపై నిప్పు రాజేయాలని ఒక వంక బ్రిటిష్, మరోవంక పాకిస్థాన్ చేసిన దుష్ట పన్నాగాలను పటేల్ సాహసంతో చెల్లాచెదురు చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం కేవలం ఈ ప్రాంత ప్రజలు  స్వేచ్ఛ,స్వాతంత్రాలు పొందడానికే కాకుండా మొత్తం భారత దేశ రక్షణలో, దేశ సమైక్యతలో అత్యంత కీలకమైన ఘట్టంగా గుర్తించాలి.
 
 బ్రిటిష్ వారు వెళ్లడంతో తనది స్వతంత్ర సార్వభౌమిక రాజ్యమైనదని 1947 ఆగష్టు 27న ప్రకటించాడు. బ్రిటిష్ అధికారుల పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణకు కూడా ఒప్పుకోలేదు. నిజం మరోవైపు పాకిస్థాన్ నిర్మాత జిన్నాతో సంబంధాలు కొనసాగించాడు. సంస్థానం భారత్ లో విలీనమైతే హైదరాబాద్ లో ముస్లింలు సహించరాని హెచ్చరించాడు.
 
మొత్తం దక్షిణ భరత్ లోనే పెద్ద ఎత్తున రక్తపాతం, మత కలహాలు జరుగుతాయని బెదిరించాడు. ఈ విషయమై నిజాం ప్రతినిధులకు, భారత ప్రభుత్వానికి మధ్య నెలల తరబడి జరిగిన సమాలోచనలు ఎటువంటి పురోగతి సాధించలేక పోయాయి. ఈ విషయంలో కేంద్రం ఎంతగా సంయమనం చూపుతున్నా నిజాం దిగిరాలేదు.
 
పలు దఫాలుగా చర్చల అనంతరం నిజాం కేంద్రంతో `యధాస్థితి ఒడంబడిక’ను నవంబర్ 29న కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం కె ఏం మున్షిని తన ఏజెంట్ జనరల్ గా హైదరాబాద్ కు పంపింది. ఈ విషయమై నిజం ఎన్నో మడత పేచీలు పెట్టాడు. ఆయన నివాసం విషయమై కూడా వివాదాలు రేపి, తాత్కాలిక నివాసం ఏర్పాటుకు తిరస్కరించాడు.
 
ఈ ఒప్పందం సిరా ఆరకముందే దానిని ఉల్లంఘిస్తూ నిజం ప్రభుత్వం రెండు ఆర్డినెన్సు లను జారీ చేసింది. ఒకటి విలువైన లోహాలకు సంబంధించిన ఎగుమతులను నిషేధించగా, మరొకటి సంస్థానంలో భారత్ కరెన్సీ చెల్లకుండా చేసాడు. మరోవంక భారత ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో పాకిస్థాన్ కు రూ 20 కోట్ల రుణాన్ని నిజాం మంజూరు చేసాడు. పలు విదేశాలలో ఏజెంట్ల నియమాకాని ప్రయత్నాలు ప్రారంభించాడు. అప్పటికే పాకిస్థాన్ లో ఒక ఏజెంట్ ను నియమించాడు. 
 
భారత ప్రతినిధి మున్షి పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. ఆయనను  దాదాపు `గృహ నిర్బంధం’లో ఉంచారు.రెండు ఆర్డినెన్సు లను ఉపసంహరించుకోమని తీవ్ర పదజాలంతో భారత ప్రభుత్వం పంపిన లేఖను మున్షి స్వయంగా అందజేయడంతో నిజాం ప్రధాని లాయక్ ఆలీ రెచ్చి పోయాడు. నిజాం ఒక అమరవీరుడిగా మరణించ దలిచాడని, అతనితో పాటు లక్షల మంది ముస్లింలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటూ తిరుగుబాటు ధోరణిలో మాట్లాడాడు. 
 
రజాకార్ల దన్నుతో తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తున్న నిజాంకు భారత్ ఆర్ధిక ఆంక్షలు విధించినా వాటిని తట్టుకొని నిలబడగలమని, కొద్దీ రోజులలోనే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకోవచ్చని  రజాకార్ల సలహాల మాయలో పడ్డాడు. ముస్లిం దేశాలన్నీ హైదరాబాద్ కు మిత్ర దేశాలు కావడంతో అవి సైనిక చర్య తీసుకోకుండా భారత్ ను నిరోధించగలవని భావించాడు. 
 
హైదరాబాద్ రేడియోలో  ఒక ప్రకటన చేస్తూ యుద్ధం అంటూ వస్తే వేలమంది పఠానూలు భారత దేశంపై దండయాత్రకు ఉపక్రమిస్తారని నిజం  బెదిరించాడు. హైదరాబాద్ సర్వసైన్యాధ్యక్షుడు ఎల్ ఎండ్రాస్ రేడియోలో ప్రసంగిస్తూ ఎట్లాంటి అత్యవసర స్థితికైనా ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చాడు.
 
ఈ సందర్భంగా ఒక చేతితో ఖురాన్ ను, మరో చేత్తో కరవాలాన్ని పట్టుకొని `జిహాద్’ కోసం ముందుకు సాగాలని, భారత్ లోని 4.5 కోట్ల మంది ముస్లింలంతా వెంట నడుస్తారని అంటూ రజ్వీ చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాల పట్ల ప్రధాని నెహ్రు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
ఈ సందర్భంగా తనను కలసిన లాయక్ అలీతో “భారత్ యూనియన్ హైదరాబాద్ ను గనుక విలీనం చేసుకొంటే కోటిన్నర మంది హిందువులను ఊచకోత కోస్తానని అంటూ రజ్వీ బెదిరిస్తున్నాడు. అదే జరిగితే, నిజాం, అతని వంశ భవిష్యత్ కూడా ప్రమాదంలో పడక తప్పదు. హైదరాబాద్ ఎట్లాగూ భారత్ లో విలీనం కావలసిందే అని సర్దార్ పటేల్ హెచ్చరించారు. 
 
భారత్ యూనియన్ లో విలీనం కావడానికి నిజం నిరాకరించడంతో సంస్థానపు ప్రజలు తిరగబడ్డారు. పోలీస్ చర్యకు పూర్వం తెలంగాణ అంతర్యుద్ధంతో స్పెయిన్ వలే ఉన్నదంటూ ప్రముఖ కవి ఆరుద్ర పేర్కొన్నారు. `భారత్ యూనియన్ లో చేరాలి’ అంటూ 1947 ఆగష్టు 7 నుండి స్వామి రామతీర్థ సత్యాగ్రహం చేపట్టారు. అంతకు ముందు ఆయనకు జవహర్ లాల్ నెహ్రు అందజేసిన జాతీయ పతాకాన్ని ఆగష్టు 15 ఉదయం 10 గంటలకు సుల్తాన్ బజార్ లో మోతిలాల్ ఎగురవేశారు.
 
మరోవంక, సరిహద్దుల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయడం ద్వారా కాంగ్రెస్ సాయుధ పోరాటం ప్రారంభించింది. పోలీస్ స్టేషన్ లపై కూడా దాడులు జరిపారు. రైలు పట్టాలను తొలగించడం, టెలిఫోన్ తీగలను తెంచడం, ప్రభుత్వం కార్యాలయాల రికార్డులను దగ్ధం చేయడం వంటి చర్యలు పాల్పడ్డారు. 
 
నిజం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని స్తంభింప చేయడం కోసం కాంగ్రెస్ సహాయనిరాకరణ ఉద్యమాన్ని చేపట్టింది. ఉద్యోగులు ఉద్యోగాలకు రాజీనామా ఇవ్వడం, విద్యార్థులు విద్యాలయాలను బహిష్కరిఅంచడం, జనం పన్నులు కట్టడానికి నిరాకరించడం, రైతులు లెవీ గింజలు ఇవ్వక పోవడం చేశారు. మరోవైపు, అటవీ సత్యాగ్రహం చేశారు. కాంగ్రెస్ ఉద్యమించే వరకు కమ్యూనిస్టులు సాయుధ పోరాటం ప్రారంభించక పోవడం గమనార్హం. 
 
1947 డిసెంబర్ 4న  కింగ్ కోటి నుండి బయలుదేరిన నిజం కారుపై ఒక యువకుడు బాంబు వేయడంతో పెద్ద పేలుడు సంభవించింది. నిజం ప్రాణాపాయం నుండి తప్పించుకున్నా సంస్థానంలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయి వెల్లడి అవుతుంది. ఒకవైపు రజాకార్ల అడ్డు అదుపు లేని దుశ్చర్యలు, ఇంకోవైపు విముక్తి ఉద్యమాలతో `అంతర్యుద్ధం’ ప్రారంభమైంది. హిందువులకు ధన, ప్రాణ, మాన రక్షణ లేకుండా పోయింది. అసలు ప్రభుత్వమే లేకుండా పోయింది. 
 
ఒక వంక పాకిస్థాన్ తో కలుస్తానని, మరోవంక ఉస్మానిస్థాన్ లేదా టర్కిస్తాన్ గా సవంతంత్ర కామన్ వెల్త్ దేశంగా కొనసాగుతానని అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. అతని కపట నాటకాలను గ్రహించిన పటేల్ `పోలీస్ చర్య’ పేరుతో మన సైన్యంను పంపేసరికి కేవలం మూడు రోజులలో చేతులెత్తేశాడు. నాలుగో రోజున లొంగిపోయాడు. ఆ విధంగా మొత్తం భారత్ కు స్వతంత్రం సిద్దించిన 13 నెలల తర్వాత గానే హైదరాబాద్ సంస్థానం ప్రజలకు స్వతంత్రం లభించలేదు.
నిజం పాలన దేశం నడిబొడ్డున కొనసాగి ఉంటె నేడు జమ్మూ కాశ్మీర్ లో ఎదురవుతున్న ఉగ్రవాద సమస్యలు మరి అనేక రేట్లు మనకు సవాళ్లు ఎదురయి ఉండేవి. బ్రిటిష్ కుట్రలను వమ్ముచేసి సర్దార్ పటేల్ రాజనీతిజ్ఞతతో దేశం ఆ ముప్పు నుండి బైటపడింది.
 
“ఈ దేశం అన్ని వ్యవస్థలతో సహా ఇక్కడ నివసించే ప్రజల సర్వోన్నత వారసత్వం కొందరు సంస్థానాల్లో, కొందరు బ్రిటిష్ ఇండియాలో ఉండటం కేవలం యాదృశ్చికం. అందరూ ఒకే సంస్కృతిలో భాగం. మనమందరం మన ప్రయోజనాల వల్లనే గాక మన రక్తసంబంధం చేత, భావ సారూప్యత చేత అనుబంధితులం. మనలను ఎవ్వరూ ముక్కలుగా చేయలేరు” అని పటేల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలకమైనదని 1930లో హైదరాబాద్ రెసిడెంట్ సర్ విలియం బార్దన్ తన నివేదికలో పేర్కొన్నారు. నిజం పాలనలో ఉన్న హైదరాబాద్ కు ఎప్పుడు మరే దేశంతో స్వతంత్రంగా సంబంధాలు ఉండెడివి కావు. బ్రిటిష్ భారత్ రక్షణలో భారంగా నిజం రక్షణను బ్రిటిష్ సైనికులే నిర్వహిస్తుండేవారు. ఇక విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, రైల్వలు, విమానాలు, పోస్ట్ … వంటి కీలక అంశాలను బ్రిటిష్ భారత్ ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉండెడిది.