కన్హయ్య కుమార్ చేరికపై ఇరకాటంలో కాంగ్రెస్!

జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే కధనాలు వెలువడుతున్నాయి.  కన్హయ్య ఇటీవల పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడంతో ఆయన పార్టీలో చేరడం ఇక లాంఛనమే అని అంటున్నారు.  ఏదేమైనా, అతని రాకతో రాహుల్,  బీహార్  కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. 

మార్చి 2016 లో, దేశద్రోహం కేసులో బెయిల్‌పై విడుదలైన కొద్దిసేపటి తర్వాత, ఢిల్లీ పోలీసులు తనపై, ఇతర విద్యార్ధులపై చర్యలు తీసుకున్నప్పుడు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలపడం కోసం రాహుల్ ను కన్హయ్య కలిసాడు.

‘దేశ వ్యతిరేక’ నివాదాలు చేసినందుకు `దేశ ద్రోహం’ ఆరోపణలపై అరెస్ట్ అయిన మయూరాస్తి రోజు విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఫిబ్రవరి 2016 లో  జెఎన్‌యు   క్యాంపస్‌ని సందర్శించిన అతికొద్ది మంది నాయకులలో రాహుల్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాలనను నాజీ పాలనతో రాహుల్ పోల్చారు. 

అయితే, 2019 లో, కన్హయ్యపై దేశద్రోహం ఆరోపణలు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు, రాహుల్, ఆయన పార్టీ పూర్తిగా మౌనం పాటించడం విస్మయం కలిగించింది.  `దేశ ద్రోహం’ ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్యకు ఎలాంటి మద్దతు ఇచ్చినా లోక్‌సభ ఎన్నికలలో తమను బిజెపి దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి ఉపయోగించుకోవచ్చని కాంగ్రెస్ నేతలు వెనుకడుగు వేశారు.

అలాగే, 2019 లో లోక్ సభ ఎన్నికల్లో, బీహార్ లో బెగుసరాయ్ నియోజకవర్గంలో కన్హయ్యను బిజెపికి చెందిన గిరిరాజ్ సింగ్‌ పై తమ అభ్యర్థిగా సిపిఐ పోటీకి దింపినప్పుడు  కాంగ్రెస్, ఆర్‌జెడితో కూడిన పార్టీల కూటమి అతనికి మద్దతు ఇవ్వలేదు. దానితో ఆయన ఎన్నికల్లో గిరిరాజ్ సింగ్‌పై 4.2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అప్పటి నుండి  కన్హయ్యతో కాంగ్రెస్ వారెవరికీ సంబంధాలు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరిన  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ప్రోత్సాహంతోనే  కన్హయ్యను పార్టీలో చేర్చుకోవడానికి రాహుల్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. సిపిఐలో సహితం ఎవ్వరు పట్టించునక పోవడంతో, ఒక రాజకీయ వేదికగా కాంగ్రెస్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తున్నది.  

 పాట్నాలోని పార్టీ కార్యాలయం నుండి తన వస్తువులను కూడా సర్దుకోవడం ద్వారా సిపిఐతో  తన బంధాన్ని తెంచుకున్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ లో అతను ఎటువంటి పాత్ర పోషించగలదన్నదే ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.  అతను తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో పని చేయడానికి ఆసక్తి కనబరిచిన్నట్లు చెబుతున్నారు. 

అతని అద్భుతమైన వక్తృత్వ నైపుణ్యాలు, జనాన్ని ఆకర్షించే సామర్థ్యంలతో  ప్రధాని మోదీపై పదునైన విమర్శలు చేయగలిగినా రాజకీయంగా బీహార్ లో కాంగ్రెస్ లో ఎటువంటి ప్రభావం చూపగలరా తేల్చుకోలేకపోతున్నారు. బీహార్ లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిలో భాగస్వామి మాత్రమే. కన్హయ్య పట్ల తొలినుండి ఆర్జేడీ ఆసక్తి చూపడం లేదు.  2019 లో లోక్ సభ ఎన్నికల్లో, బెగుసరాయ్ నుండి కన్హయ్యను పోటీకి దింపాలని సిపిఐ నిర్ణయించిన కారణంగానే వామపక్ష పార్టీతో ఆర్జేడీ జతకట్టలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆర్జేడీ ప్రమేయం లేకుండా కాంగ్రెస్ నాయకుడిగా బీహార్ లో రాణించగలడా?