హైందవజీవన విధానానికి శత్రువు అంటే నెహ్రు మాత్రమే!

హైందవ జీవన విధానానికి ఎవరైన శత్రువు ఉన్నారంటే అది తన తాత, మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అనే విషయాన్ని రాహుల్‌ గాంధీ తెలుసుకోవాలని బిజెపి తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగరరావు హితవు చెప్పారు. 1951లో హిందూ కోడ్‌ బిల్లు ద్వారా ఆయన ఏకపక్షంగా హైందవ ధర్మాన్ని హిందూయిజంగా పేర్కొని దాన్ని ఒక మతంగా క్రోడికరించారని గుర్తు చేశారు.

నకిలీ హిందువులు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్‌ గాంధీ తాత నెహ్రు, ఆయన మొత్తం వంశం అని విమర్శించారు.  హైందవ ధర్మాన్ని ఒక మతంగా పేర్కొనడం దైవదూషణ అని స్పష్టం చేస్తూ స్పష్టమైన రాజకీయ కుట్రలో భాగంగా అత్యున్నత స్థాయి ధర్మాన్ని ఒక మతంగా పరిమితం చేశారని ఆరోపించారు.

`నకిలీ హిందువులు’ అంటూ బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లపై రాహుల్ చేసిన విమర్శల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్‌ గాంధీ తీవ్ర నిరాశలో ఉన్నారనే విషయం దేశం మొత్తానికి స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఓటర్లను బుజ్జగించేందుకు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ  తానే రాజు, తానే బంటుగా వ్యవహరించలేరని, ఆ ఆటలో వారు చాలా వెనుకబడిపోయారని స్పష్టం చేశారు.

కులం, జాతి, ప్రాంతం ఆధారంగా హిందువులను 1947లోనే కాంగ్రెస్‌ పార్టీ విభజించి 60 ఏళ్ల పాటు రాజకీయంగా లబ్ది పొందిందని చెబుతూ ఆ పాత కాలపు విభజన రాజకీయాలు ఎన్నికలపరంగా ఫలితాలు తీసుకురావడం లేదు కాబట్టి ఇప్పుడు రాహుల్‌ గాంధీ కొత్త పల్లవి అందుకుంటున్నారని ధ్వజమెత్తారు. మహోన్నతమైన ఈ ధరణిపై ఉన్న హైందవధర్మాన్ని స్వాతంత్య్రనంతరం కాంగ్రెస్‌ పార్టీ తన స్వార్థ ప్రయోజనాల కోసం విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసి  పాక్షికంగా ఆ విషయంలో విజయం సాధించినందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ధర్మం ఎప్పుడు ఐక్యంగా ఉంటుందని, ఎన్నికల లబ్ది కోసం దాన్ని విభజించకుండా ఉండాల్సిందని పేర్కొంటూ ఒకసారి దాన్ని ఒక మతం స్థాయికి తగ్గించిన తర్వాత రాజకీయ అవసరాల కోసం దానికి రేఖలు గీయడం, విభజించడం సులువైపోయిందని కృష్ణసాగరరావు విచారం వ్యక్తం చేశారు.

బహుశా రాహుల్‌ గాంధీ  గత చరిత్ర తెలుసుకునే తన ప్రసంగంలో జవహర్‌ లాల్‌ నెహ్రూ పేరు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. రాహుల్ తన ప్రసంగంలో కేవలం మహాత్మా గాంధీ పేరును మాత్రమే ప్రస్తావించారని గుర్తు చేశారు. హైందవాన్ని అర్థం చేసుకునేందుకు గాంధీ జీవితాంతం ప్రయత్నించారని చెప్పడమే దానికి తార్కణం అని తెలిపారు.

మహాత్మా గాంధీ గొప్పదనాన్ని పేర్కొనడం ద్వారా హైందవ జీవన విధానాన్ని నెహ్రూ అర్థం చేసుకోలేదని, ఆయన ఆ మార్గంలో జీవించేందుకు ప్రయత్నించలేదనే విషయాన్ని రాహుల్‌ గాంధీ అంగీకరించారని బిజెపి నేత ఎద్దేవా చేశారు. అంతే కాదు నెహ్రూ మాత్రమే కాదు ఆయన వారసులు ఎవరూ కూడా హైందవ ధర్మాన్ని అర్థం చేసుకోలేదు, హైందవ జీవనమార్గంలో నడవలేదని స్పష్టం చేశారు.

ఇందిరా గాంధీ, సంజయ్‌ గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ లేదా రాహుల్‌ గాంధీని చూసినా వారు తీసుకున్న నిర్ణయాలు పరిశీలిస్తే అవన్నీ హైందవ ధర్మానికి భంగకరంఉన్నాయన్నది సుస్పష్టంగా అర్థమైపోతుందని చెప్పారు. ఎవరు నిజమైన హిందూ, ఎవరు నకిలీ హిందూ అనే అపరిపక్వ మాటలు మాట్లాడే ముందు అద్దంలో తనను తాను చూసుకోవాలని రాహుల్‌ గాంధీకి కృష్ణసాగరరావు హితవు చెప్పారు.