ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం, హత్య ….తర్వాత ఆత్మహత్య!

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్ర హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

రాజు ఆచూకీకి సంబంధించి సమాచారం ఇచ్చే వారికి రూ.10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీసులు ప్రకటించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌ను స్వయంగా రాష్ట్ర డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు సెల్‌ఫోన్ వాడకపోవడంతో అతడి ఆచూకీ గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. 

దీంతో సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో సైదాబాద్ నిందితుడు, మోస్ట్ వాంటెడ్ రాజుకు సంబంధించి మరిన్ని ఫోటోలు, క్లూస్‌ని హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేశారు. ఆ మేరకు రెండు ట్వీట్స్ చేశారు.

నిందితుడి కోసమై పెద్ద ఎత్తున గాలింపు చేపట్టిన పోలీసులు ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్‌పై  రాజు మృతదేహం లభ్యమైనట్లు గురువారం చెబుతున్నారు. మృతుడి చేతిపై మౌనిక అనే పేరుతో ఉన్న టాటూ ఆధారంగా అతడు హత్యాచార నిందితుడు రాజు అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

రాజు నాయక్(30) అనే వ్యక్తి భార్యతో కలిసి బాధితురాలి ఇంటి పక్కనే ఆరునెలలుగా నివాముంటున్నాడు. మద్యానికి బానిసైన రాజు నిత్యం భార్యను వేధిస్తుండడంతో ఆమె అతనిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రాజు నిత్యం మద్యం సేవించడంతో పాటు చిల్లర దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటి పక్కన ఉన్న బాలిక గురువారం గురువారం సాయంత్రం ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తానని నమ్మించి తన ఇంటికి తీసుకుని వెళ్లాడు.

అక్కడ బాలికపై అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని పరుపులో చుట్టి బయట వేసేందుకు యత్నించాడు. ఇంటి బయట చుట్టుపక్కల వారు ఉండటంతో ఇంటికి తాళం వేసి సొంత గ్రామమైన అడ్డగూడురుకు పారిపోయాడు. ఈ క్రమంలోనే బాలిక కనిపించకుండా పోవడంతో గురువారం రాత్రి 9 గంటల వరకు తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు.

అయినా ఆచూకీ లభించకపోవడంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో రాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు రాత్రి 12 గంటలకు వచ్చి రాజు ఉంటున్న ఇంటి తాళం పగులగొట్టి చూడడంతో బాలిక మృతదేహం లభ్యమైంది. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం నాడు పోస్టుమార్టం చేసిన వైద్యులు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు.

ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనను నిరసిస్తూ నగరంలోని చంపాపేట్ వద్ద సాగర్ రోడ్డుపై కాలనీవాసులంతా నిరసనకు దిగారు. అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకున్న నిందితుడు రాజును ఎన్‌కౌంటర్ చేయాలని లేనిపక్షంలో తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో పోలీసులకు, కాలనీవాసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఎవరూ తనను గుర్తించకుండా గుండు చేయించుకుని ఉంటే ఎలా ఉంటాడన్న దానిపై ఓ ఊహా చిత్రాన్ని కూడా పోలీసులు విడుదల చేశారు. అలాగే నిందితుడి చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉంటుందని పోలీసులు తెలిపారు.

సైబరాబాద్ కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మఫ్టీ పోలీసులు, ఎస్వోటి, ఎస్బీ, లోకల్ పోలీసులతో ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి నిఘా పెట్టామని  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర  తెలిపారు . ఎవరికైనా నిందితుడు రాజు ఆచూకీ తెలిస్తే డయల్ 100 కి ఫోన్ చేయాలని  ప్రజలకు సీపీ విజ్ఞప్తి చేసారు.

సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక కుటుంబాన్ని బీజేపీ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ జి  వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. నిందితుడ్ని వెంటనే పట్టుకొని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని చెప్పారు. 

కేటీఆర్ దత్తత తీసుకున్న ఈ కాలనీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌‌ఎస్ నాయకుల కోసం మాత్రమే పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్ల బాలికపై ఇంతటి ఘోరం జరిగినా ఇప్పటి వరకూ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులవరూ కనీసం కుటుంబానికి అండగా నిలుస్తామన్న భరోసా ఇచ్చేందకు రాలేదని విస్మయం వ్యక్తం చేశారు. 

హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు, దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చిన్నారికి జరిగిన దారుణం తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి, ఆ బిడ్డ తల్లిదండ్రులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.