కేటీఆర్ ట్వీట్ ప్రభుత్వం గందరగోళంకు నిదర్శనం

మంత్రి కేటీఆర్, ఆరేళ్ల పాపపై అఘాయిత్యం చేసిన వాడు దొరికేశాడని ట్వీట్ చేసి, తిరిగి, తన ట్వీట్ ను తానే తప్పని మరో ట్వీట్ చేయడం చూస్తుంటేనే అర్థమవుతోంది టిఆర్ఎస్ ప్రభుత్వంలో గందరగోళం ఏ స్థాయిలో ఉందో.. పరిపాలన ఎలా సాగుతుందో అంటూ బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్ రావు ఎద్దేవా చేశారు.
ప్రభుత్వంలో అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, మంత్రుల మధ్య గ్యాప్ ఏ స్థాయిలో ఉందో అంటూ ఎడమ చేయి ఏం చేస్తోందో, కుడి చేయికి కూడా తెలియని పరిస్థితి నెలకొన్నదని ధ్వజమెత్తారు. ఏదైనా జరిగినప్పుడు హడావుడిగా నాలుగు ముక్కలు మాట్లాడి దులిపేసుకోవడం కేసీఆర్ ప్రభుత్వానికి అలవాటే అంటూ దుయ్యబట్టారు.

ఎప్పట్లానే అసలు హోం మంత్రి మహమూద్ అలీ అనే వ్యక్తి ఎక్కడా కనీసం సీన్ లో కనిపించడం లేదని ఆయన గుర్తు చేశారు. అసలు ఈ వ్యవహారంపై స్వయంగా రాష్ట్ర హోం మంత్రి ఒక్కసారి ప్రజల ముందుకు రాలేదని విస్మయం వ్యక్తం చేశారు. మీడియా ఎదుట చిన్న మాట కూడా మాట్లాడలేదని, అసలు కేసు విచారణ ఏ స్థాయిలో ఉందో డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ప్రజలకు వివరించలేదని ఆయన తెలిపారు.

ఓవైపు ఘోరమైన దుర్ఘటన జరిగి, ఘటన జరిగి ఇన్ని రోజులు అయినా అనుమానితుడు దొరక్కుండా తప్పించుకుంటోన్న వేళ, నగరం నడి బొడ్డులో ఇంత దారుణ పరిస్థితులు ఉన్న వేళ, తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి వర్యులు చీకట్లో, ముసుగు వెనుక దాచుకోకుండా, బాధ్యతలు విస్మరించుకుండా, బయటకు వచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలు పట్టించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

అసలు హోం మంత్రి మహమూద్ అలీ తన బాధ్యతలు విస్మరించినందుకు రాజీనామా చేయాలని  కృష్ణ సాగర్ రావు  డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు నిర్వహించడం ఆయనకు చాతకాకపోతే దిగిపోవడమే మంచిందని హితవు చెప్పారు .