హైకోర్టు తీర్పు ఇచ్చినా సాగర్‌లోనే నిమజ్జనం!

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వినాయక విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చినా కొన్ని నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇళ్లు, కార్యాలయాల్లో పూజలు చేసిన పీఓపీ విగ్రహాలను కొందరు సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు.
 
హుస్సేన్ సాగర్ లోనే వినాయక నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డా. భగవంతరావు వెల్లడించారు. నిమజ్జనానికి ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. నిమజ్జనం చేసుకోవద్దని హైకోర్టు చెప్పలేదని, కోర్టు తీర్పును అమలు చేస్తారా చేయారా ప్రభుత్వం చేతిలో ఉందని ఆయన పేర్కొన్నారు.
 
ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా సాగర్ లో నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశాన్నారు. కోర్టు తీర్పులను కాదని జల్లికట్టు లాంటి పండుగలే నిర్వహిస్తుంటే నిమజ్జనం ఎందుకు చేయొద్దన్నారని డా. భగవంతరావు ప్రశ్నించారు.
 
కాగా, సాగర్ లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాలు నిమజ్జనం చేయోద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్​వేశారు. కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ ఉండటంతో నిమజ్జనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. ప్రత్యమ్నాయంగా ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ ఆర్ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాట్లయితే చేశారు.
 
 ఫీట్లకు పైగా ఎత్తున్న విగ్రహాలను ఈ రెండు ప్రాంతాల్లో వేస్తుండగా ఇంతకు తక్కువ ఎత్తున్న వాటిని సంజీవయ్యపార్కులోని బేబీ పాండ్ లో వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నిమజ్జనం కోసం మంగళవారం ఎన్టీఆర్ మార్గ్​పై రెండు క్రేన్లు, పీపుల్స్ ప్లాజా వద్ద 5, బేబీ పాండ్ లో 2 క్రేన్లను ఏర్పాటు చేశారు. 
 
ప్రభుత్వ యంత్రాంగాలు కేవలం మట్టి గణపతులను మాత్రమే సాగర్‌లో నిమజ్జనం చేయాలని సూచిస్తూ ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌లపై క్రేన్లను అందుబాటులో పెట్టలేదు. జలవిహార్‌ సమీపంలో ఉన్న బేబీ పాండ్‌లో మాత్రమే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఏర్పాట్లు చేయగా అక్కడ విపరీతమైన రద్దీ ఉంటోంది.
 
దీంతో చాలామంది ట్యాంక్‌బండ్‌ పై నుంచి, ఎన్టీఆర్‌ మార్గంలో ఫుట్‌పాత్‌ పై నుంచి చిన్నపాటి పీఓపీ వినాయక విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. కొందరు యువకులు డబ్బులు తీసుకుని వాటిని సాగర్‌లో వదులుతున్నారు. ప్రజల సెంటిమెంట్‌ పేరుతో పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
 
బేబీపాండ్‌ వద్దకు వెళ్లాలని ఒక్కోసారి పోలీసులు సూచిస్తున్నా ఎవరూ పాటించడం లేదు. ఐదో రోజున పెద్ద ఎత్తున విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి. ఇందులో ఎక్కువగా 4 అడుగుల లోపు మాత్రమే ఉన్నాయి.

వచ్చే ఏడాది ఖైరతాబాద్‌లో మట్టి గణపతే!

ఇలా ఉండగా, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్(పీఓపీ) విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.  నగర మేయర్ గద్వాల్‌ విజయలక్ష్మి విజ్ఞప్తి మేరకు వచ్చే యేడాది మట్టి గణపతిని ప్రతిష్టించేందుకు నిర్వాహకులు అంగీకరించారని మేయర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకున్న విజయలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా మట్టి గణపతి ఏర్పాటుపై ఉత్సవ కమిటీ ప్రతినిధులతో ఆమె చర్చించారు. పర్యావరణం, నిమజ్జనంలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఏకో ఫ్రెండ్లీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు. ఆమె విజ్ఞప్తిపై వారు సానుకూలంగా స్పందించినట్టు మేయర్‌ కార్యాలయం తెలిపింది.
 
ఈసారి ట్యాంక్ బండ్ లోనే ఖైరతాబాద్ గణేశ్ ను నిమజ్జనం చేస్తామని స్పష్టం చేస్తూ అలా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని, కోర్టును ప్రత్యేకంగా కోరుతున్నామని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగారి సుదర్శన్ కోరారు.  అనుమతి లేదంటే విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతామని చెప్పారు. అయితే,  వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టిస్తామని, మండపంలోనే నిమజ్జనం చేస్తామని తెలిపారు. ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు10 లక్షల మందికిపైగా దర్శించుకున్నారని వెల్లడించారు.