కేటీఆర్ ఓ అజ్ఞాని.. రాజీనామా చేయాల్సిందే

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని, ఎవరిది తప్పయితే వారు రాజీనామా చేయాలని మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టిపారవేశారు. కేటీఆర్ కాదు… కేసీఆర్ సవాల్ విసిరితే అప్పుడు చూస్తానని స్పష్టం చేశారు. యూపీఏ కంటే ఎన్డీయేనే రాష్ట్రానికి 9 శాతం అధికంగా నిధులు ఇచ్చిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుందని వెల్లడించారు. కేటీఆర్ కు రాజ్యాంగం తెలియదని విమర్శించారు. 

ఒక్కో తెలంగాణ వ్యక్తిపై లక్ష రూపాయల అప్పు చేసినందుకు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినందుకు కేటీఆరే రాజీనామా చేయాలని తెలిపారు. కేటీఆర్ ఓ అజ్ఞాని అని, తుపాకీ రాముడు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకుండా ఉంటె ప్రధానికి కేసీఆర్ లేఖ వ్రాయవచ్చు గదా అని సవాల్ చేశారు.

కాగా, రాష్ట్రానికి కేంద్రం తక్కువ పన్నులు ఇస్తుందన్న కేసీఆర్ రాజీనామా లేఖతో చర్చకు రావాలని బిజెపి ఎంపీ డి అర్వింద్ సవాల్ చేశారు. లేదంటే రాజీనామా చేసి రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఇచ్చే పన్నుల కంటే కేంద్రం తెలంగాణకు ఎక్కువే ఇస్తోందని అర్వింద్ చెప్పారు.

దొడ్డు బియ్యం కొనమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని.. మంత్రి హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బియ్యం సేకరణ కోసం రాష్ట్రానికి ప్రతి పైసా ఇప్పటి వరకు కేంద్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు వెంటనే తెరిపించాలని అర్వింద్  డిమాండ్ చేశారు.

 ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలి 

ఇలా ఉండగా, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భృతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి’ అని ఆ లేఖలో కోరారు. 

ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రచారం చేసిన కేసీఆర్త న కుటుంబం, వారి బంధువులకు మాత్రమే  డజను ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. నిరుద్యోగ భృతి కింద విద్యావంతులైన యువతీ, యువకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయలు బకాయి పడింది. ఆ లక్ష రూపాయలను నిరుద్యోగ యువతీయువకులు వెంటనే అందించాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.