చనిపోతూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన కానిస్టేబుల్ 

ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ చనిపోతూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన గుండెను ఒకరికి అమర్చారు. అలాగే, లివర్‌, రెండు కిడ్నీలు, ఒక కన్నును మరో నలుగురిని అమర్చనున్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచికి చెందిన వీరబాబు (34) రాష్ట్ర పోలీస్‌ శాఖలో 2013లో ఉద్యోగంలో చేరారు. కొండాపూర్‌లోని టీఎ్‌సఎస్సీ 8వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవారు. 

వినాయక చవితి పండుగకు సెలవుపై ఖమ్మంలోని సొంతూరు వెళ్లారు. ఈ నెల 12న తన పనులు ముగించుకొని తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్న సమయంలో గొల్లపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొటడ్డంతో వీరబాబు తలకు బలమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆయనను మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. వీరబాబు మెదడుకు గాయాలు కావడంతో బ్రెయిన్‌డెడ్‌ అయిందని మంగళవారం రాత్రి వైద్యులు నిర్ధారించారు. 

దీంతో వీరబాబు కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో వీరబాబు గుండెను సేకరించి కూసుమంచి మండలం మునిగేపల్లికి చెందిన పెయింటర్‌ తుపాకుల హుస్సేన్‌కు అమర్చారు. లివర్‌, రెండు కిడ్నీలు, ఒక కన్నును మరో నలుగురికి అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు.

కాగా, కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన తుపాకుల హెస్సేన్‌ మూడేళ్లుగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ జీవన్‌దాన్‌లో గుండె కోసం మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. అలా దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే ఆయనకు గుండె లభ్యం కావడం గమనార్హం.

వీరబాబు గుండెను నిమ్స్‌కు తరలించి, అమర్చేందుకు వైద్య  బృందం మలక్‌పేట యశోద ఆస్పత్రిలో సేకరించిన వీరబాబు గుండెను ప్రత్యేక బాక్స్‌లో భద్రపరచి మధ్యాహ్నం 1.46 నిమిషాలకు అంబులెన్స్‌లో తీసుకెళ్లింది. ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌చానల్‌ ఏర్పాటు చేసి 12 నిమిషాల్లోనే పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రికి గుండెను చేర్చారు.

నిమ్స్‌ వైద్యులు సాయి సునీల్‌, రవితేజ బృందం గుండెను ఆపరేషన్‌ థియేటర్‌లోనికి తీసుకువెళ్లి విజయవంతంగా ఆపరేషన్‌ ముగించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేసినట్టు డాక్టర్‌ అమరేశ్‌ తెలిపారు. ప్రస్తుతం హుస్సేన్‌ కోలుకుంటున్నాడని తెలిపారు.

మరోవైపు, మరో ఘటనలో ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరిన ఊపిరితిత్తులను బేగంపేట కిమ్స్‌ ఆస్పత్రికి తరలించేందుకు సైబరాబాద్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మరో గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేశారు. 36.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేగంపేట కిమ్స్‌ ఆస్పత్రికి 27 నిమిషాల్లో ఊపిరితిత్తులను తరలించారు.