ఆఫ్ఘన్ ప్రభుత్వంలో హక్కానీల ఆధిపత్యంపై బరదార్ అసహనం!

తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో కీలక పోస్టులు, ఆఫ్ఘన్‌ స్వాధీనంపై కెడ్రిట్‌ ఎవరిది అన్న అంశాలపై రెండు గ్రూపుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.  తాలిబన్‌లలో శక్తిమంతమైన విభాగానికి అధినేతగా పనిచేసిన ముల్లా మహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. 

మంత్రివర్గంలో హక్కానీలకు కీలక హోదా లభించింది. అయితే తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఈ ప్రభుత్వ ప్రకటనపై అయిష్టత వ్యక్తం చేసినట్ల సమాచారం. బరాదర్‌ కొద్దిరోజులుగా ఎక్కడా కనిపించడంలేదు. సమావేశాలకు, ప్రెస్‌మీట్లకు కూడా హాజరుకావడంలేదు

కాబూల్‌లోని అధ్యక్షుడి భవనంలో గత వారం డిప్యూటీ ప్రధాని అబ్దుల్ ఘనీ బరదార్, హక్కానీ నెట్‌వర్క్ సీనియర్ నేత, తాలిబన్‌ తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి ఖలీల్-ఉర్-రహ్మాన్ హక్కానీ మధ్య పెద్ద వాగ్వాదం జరిగినట్లు బీబీసీ తెలిపింది. 

ఈ సందర్భంగా ఇరు నేతల మద్దతుదారులు ఘర్షణకు దిగినట్లు తాలిబన్‌ అధికారి చెప్పినట్లు వెల్లడించింది. ఈ కాల్పుల్లో బరదార్‌ చనిపోవడం లేదా గాయపడినట్లు వదంతులు వచ్చాయి. అయితే తాను బతికే ఉన్నట్లు బరదార్‌ ఒక ఆడియో సందేశాన్ని ఇటీవల విడుదల చేశారు. మీడియాలో వచ్చిన వదంతులు అవాస్తవాలన్న ఆయన తాను ఎక్కడ ఉన్నా అంతా క్షేమంగా ఉన్నామని తెలిపారు.

మరోవైపు ఈ ఘర్షణ అనంతరం బరదార్‌ తాలిబాన్ అత్యున్నత నాయకుడు హైబతుల్లా అఖుంద్‌జాదాను కలవడానికి కాబూల్‌ను వీడి కాందహార్ దక్షిణ నగరానికి వెళ్లి ఉంటారని తెలుస్తున్నది. అయితే ఆయన అలిసిపోయారని, విశ్రాంతి కోసం అక్కడకు వెళ్లారని తాలిబన్‌ వర్గాలు పేర్కొన్నట్లు బీబీసీ తెలిపింది.

ప్రధాని పదవి ఆశించిన బరాదర్‌

తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరదార్ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. 2010-18 మధ్య పాకిస్థాన్‌ జైలులో ఉన్న ఆయన అమెరికా మద్దతుతో విడుదలయ్యారు. తాలిబన్‌, అమెరికా మధ్య జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు. 

అమెరికా బలగాల ఉపసంహరణ, ఆఫ్ఘనిస్థాన్‌లో సుస్థిరతకు సంబంధించి 2020 ఫిబ్రవరిలో జరిగిన వివాదస్పద శాంతి ఒప్పందంపై ఆయన సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్‌ వశం కావడం వెనుక తన పాత్ర ఎంతో ఉన్నదని, ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం తనకే ఉండాలని బరదార్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

హమీద్‌ కర్జాయ్,  అబ్దుల్లా అబ్దుల్లా వంటి తాలిబానేతర నేతలకు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తామని దోహా ఒప్పందం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వ ఏర్పాటులో ఇతర దేశాలు జోక్యం చేసుకోబోవని పేర్కొంది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో పాకిస్తాన్‌ జోక్యంచేసుకుంది. 

పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ అహ్మద్‌ ఆఫ్ఘన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటులో పావులు కదిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాన శాఖలు హక్కానీలకు కేటాయించేలా ఒప్పించారు. దీంతో హమీద్‌ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా నేతలకు చోటు దక్కలేదు. 

ఐఎస్ఐ జోక్యం పట్ల బరాదర్‌ ఆగ్రహం 

భారత్ కు అనుకూలంగా, పాకిస్థాన్ కు వ్యతిరేకునిగా పేరొందిన తనను ప్రధాని కాకుండా ఐఎస్ఐ జోక్యంతో పాకిస్తాన్ అడ్డుకున్నది బరాదర్‌ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది. పాకిస్తాన్ అదుపాజ్ఞలలో ఉన్న హక్కానీలకు ప్రభుత్వంలో కీలక పదవులు దక్కేటట్లు చూసారని కూడా అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

పాక్‌ జోక్యంపై మనస్తాపానికి గురైన బరాదర్‌ హక్కానీలతో వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. దీంతో అసంతృప్తికి గురైన బరాదర్‌.. ఎవరికీ చెప్పకుండా కాందహార్‌ వెళ్లిపోయాడని తెలుస్తున్నది. మరోవైపు తమ పోరాటం వల్లనే ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకోగలినట్లు తాలిబన్‌ సీనియర్‌ నేత నేతృత్వంలోని హక్కానీ గ్రూప్‌ వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆధిపత్యం తమకే ఉండాలని ఖలీల్-ఉర్-రహ్మాన్ హక్కానీ పట్టుబట్టారు. 

ఆఫ్ఘనిస్థాన్‌లో అత్యంత హింసాత్మక దాడులకు కారణమైన హక్కానీ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ సోదరుడు ఆయన. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ముందే కీలక పదవులను తమ గ్రూప్‌ సభ్యులకు కట్టబెట్టారు. కాబూల్‌ సెక్యూరిటీని కూడా హక్కానీ నెట్‌వర్క్‌ చూస్తున్నది.

2008లో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం గేట్‌ వద్ద జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 60 మంది చనిపోయారు. ఈ దాడి కూడా హుక్కానీ నెట్‌వర్క్‌ పనేనన్న ఆరోపణలున్నాయి. ఈ గ్రూప్‌ను ఐరాసతోపాటు అమెరికా ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన అంతర్గత మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ తలపై అమెరికా 5 మిలియన్‌ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. కాగా, తాలిబన్‌లో లుకలుకలు, అంతర్గత పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తున్నది.