ఇంటిపేరు కల్వకుంట్ల కాదు జూటకోర్!

సీఎం కేసీఆర్ తన ఇంటిపేరు కల్వకుంట్ల కాదు జూటకోర్ పెట్టుకుంటే బాగుంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి.కె. అరుణ ఎద్దేవా చేశారు. గద్వాల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ అనేక అబద్దాలు మాట్లాడారని, తనపై, బీజేపీ పార్టీ పట్ల అవాకులు చెవాకులు పేలారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు.
 
టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మొదటి జీవో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేదే అన్నారు.. ఏమైంది? అని ఆమె ప్రశ్నించారు. వాల్మీకులను ఎస్టీ ల చేర్చే అంశం కేంద్రానికి పంపించామని, కేంద్రం చేయడం లేదని అబద్ధాలు చెబుతున్నారని ఆమె విమర్శించారు. కేసీఆర్ చేతకాని దద్దమ్మ .. హామీ ఇచ్చింది మీరా ? బీజేపీ నా.. ? దొరసాని అంటే ఖబడ్దార్… దొర అనిపించుకోవడం నీకు ఇష్టమేమో కానీ నాకు లేదని ఆమె స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో దమ్ము ధైర్యం ఉంటే గద్వాల్ కు రా చర్చిద్దామని డీకే అరుణ సవాల్ చేశారు. డగుల్బాజీ తెలంగాణ ఆదాయాన్ని ఉత్తరప్రదేశ్ కి పంపించారని మీ అయ్యతో యాదాద్రి కి వచ్చి చెప్పమను అని ఆమె  సవాల్ చేశారు. 

తెలంగాణ ఒక్కటే కాదు అన్ని రాష్ట్రాల నుండి పన్నులు కేంద్రానికి వస్తాయి, నీ బార్లు, బీర్ల డబ్బులు కేంద్రానికి పంపిస్తున్నావా.? అని ఆమె నిలదీశారు. దేశాన్ని రక్షిస్తున్న వారు ఉత్తర ప్రదేశ్ వారే నని అందుకే ktrకేటీఆర్ మాట్లాడారా ? అని ఆమె ప్రశ్నించారు.

రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తర్వాత కాలికి ముళ్ళు కుచ్చుకుంటే  పంటితో తీస్తామని చెప్పే పార్టీ కాదు బీజేపీ అని డీకే అరుణ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఆదాయాన్ని హైదరాబాద్ లోనే ఖర్చు చేస్తున్నావా ?అని ఆమె నిలదీశారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం రోడ్లు కాకా మీ ముఖాలకు రోడ్లు వేయించారా? అని ఆమె నిలదీశారు. 

 
ఓట్ల కోసం బతికె బతుకులు మీవి, వైకుంఠ దామాల దగ్గర సిగ్గులేకుండా కేసీఆర్ ఫొటోలు పెట్టుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. నీ హామీలకు కేంద్రం ఎందుకు నిధులు ఇస్తుందని ఆమె ప్రశ్నించారు. నియంతలకు ఏ గతి పట్టిందో కేసీఆర్ కు ఆ గతే పడుతుందని డీకే అరుణ జోస్యం చెప్పారు.