బీజేపీలో చేరిన ‌జ్ఞాని జైల్ సింగ్ మనుమడు

మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ మనవడు ఇందర్‌జీత్ సింగ్ సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి సమక్షంలో ఆయన బీజేపీ సభ్యత్వం స్వీకరించి కాషాయ కండువా కప్పుకొన్నారు. తన దివంగత తాత కోరికను తాను నెరవేర్చానని ఇందర్‌జీత్ సింగ్ పేర్కొన్నారు

 మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్‌తో కాంగ్రెస్‌ పార్టీ సరిగా  వ్యవహరించలేదని ఆయన విమర్శించారు. ‘నా తాతతో కాంగ్రెస్ సరిగా ప్రవర్తించలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు చూసి నా తాత చాలా బాధపడ్డారు’ అని సింగ్ ఆరోపించారు. 

రాజకీయాల్లో చేరాలన్న తన కోరిక చెప్పినప్పుడు, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీల ఆశీర్వాదం తీసుకోమని నా తాత జైల్‌ సింగ్‌ చెప్పారని వెల్లడించారు.  ఆ సమయంలో తాను బీజేపీలో చేరనప్పటికీ, తనను బీజేపీలో చేరమని ఆయన (జ్ఞాని జైల్‌సింగ్) తరుచు చెబుతుండేవారని గుర్తు చేసుకున్నారు.

బీజేపీ సీనియర్ నాయకుడు మదన్ లాల్ ఖురానా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఆ పార్టీలో చేరకుండానే ఆయన కోసం ప్రచారం చేసిన సంగతిని గుర్తు చేశారు. ఈ రోజు బీజేపీలో చేరడంపై తాను తీసుకున్న ఈ నిర్ణయంపై తన తాత చాలా సంతోషిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.కాగా, ఇందర్‌జీత్ సింగ్ బీజేపీలో చేరికతో తమ పార్టీని పంజాబీ ప్రజలు అభిమానిస్తున్నారన్న సంగతి నిరూపితమైందని ఆ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్‌ దుష్యంత్ గౌతమ్ తెలిపారు. పంజాబ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఆయన చేస్తున్న సామాజిక సేవను హర్దీప్‌ సింగ్‌ పురి ప్రశంసించారు.

ఇందర్జీత్‌ సింగ్‌ తాత జ్ఞాని జైల్‌ సింగ్‌ 1982 నుండి 1987 వరకు భారత రాష్ట్రపతిగా పని చేశారు. 1994 నవంబర్‌ 29న ఆనంద్‌పూర్ సాహిబ్‌కు వెళ్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. చండీగఢ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ ఏడాది డిసెంబర్ 25న చనిపోయారు.