కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమ‌వారం మృతి చెందారు. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఫెర్నాండెజ్‌  మంగ‌ళూరులోని యెనిపోయా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఇవాళ క‌న్నుమూసిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఫెర్నాండెజ్ మృతిప‌ట్ల కాంగ్రెస్ నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించారు.

ఈ ఏడాది జులైలో ఫెర్నాండెస్ త‌న ఇంట్లో యోగాస‌నాలు చేస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు కింద‌ప‌డిపోయారు. దీంతో ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి ప‌రీక్షించి, మెద‌డులో ర‌క్తం గ‌డ్డ క‌ట్టిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. అనంత‌రం ఫెర్నాండెజ్‌కు స‌ర్జ‌రీ నిర్వ‌హించి బ్ల‌డ్ క్లాట్‌ను తొల‌గించారు. అప్ప‌ట్నుంచి ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

1980లో క‌ర్ణాటక‌లోని ఉడుపి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1984, 1989, 1991, 1996లో లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. 1998, 2004లో రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఫెర్నాండెజ్‌కు భార్య బ్లూజ‌మ్, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఫెర్నాండెజ్ 1941, మార్చి 27న ఉడుపిలో జ‌న్మించారు.

 ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఆయనకు పేరుంది. మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో రవాణా, రోడ్లు, హైవేల మంత్రిగా పనిచేశారు. కార్మిక శాఖ అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 

1996లో ఏఐసీసీ  ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1980 దశకంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా, 1989 నుంచి 1999 వరకూ కేపీసీసీ సభ్యుడిగా ఉన్నారు. రాజీవ్ గాంధీకి పార్లమెంట్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. 2004 నుంచి 2009 వరకూ కేద్ర మంత్రిగా ఎన్ఆర్ఐ వ్యవహారాలు, యువజన క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశారు.

ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ విచారం వ్య‌క్తంచేశారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మ‌ర‌ణ‌వార్త త‌న‌ను చాలా బాధించిందని పేర్కొన్నారు. ఈ విషాద స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు, శ్రేయోభిలాషులకు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాన‌న్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని కార్యాల‌యం ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.