ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి మృతి

ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి మృతి
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, మేజర్ జనరల్ (పదవీ విరమణ పొందిన) భువన్ చంద్ర ఖండూరి, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా మంగళవారం డెహ్రాడూన్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. 1934 అక్టోబర్ 1న డెహ్రాడూన్‌లో జన్మించిన ఖండూరి, మూడు దశాబ్దాలకు పైగా భారత సైన్యంలో సేవలందించారు. ‘అతి విశిష్ట సేవా పతకం’ (ఎవిఎస్ఎం) గ్రహీతగా నిలిచారు. 
 
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్ దళ్ నాయకుడు హేమవతి నందన్ బహుగుణ మేనల్లుడైన ఖండూరి, 1991లో బీజేపీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, గర్వాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన 1998, 1999, 2004, 2014లలో — మరో నాలుగు సార్లు అదే స్థానం నుండి గెలుపొందారు. అయితే, 1996, 2009లలో, అప్పటి కాంగ్రెస్ నాయకుడు (ప్రస్తుత బీజేపీ మంత్రి) సత్పాల్ మహారాజ్ చేతిలో ఆయన ఈ స్థానాన్ని కోల్పోయారు. 
 
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మొదట రహదారి రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర బాధ్యత) పనిచేసిన ఆయన, ఆ తర్వాత క్యాబినెట్ మంత్రి స్థాయికి పదోన్నతి పొందారు. ‘స్వర్ణ చతుర్భుజి’ ప్రాజెక్టును, ‘జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని’ ముందుకు నడిపిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఉత్తారఖండ్‌కు రెండుసార్లు – 2007 నుంచి 2009 వరకు, 2011 నుంచి 2012 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు. భువన్ చంద్ర రాజకీయాల్లోకి రాకముందు ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్‌గా కూడా పని చేశారు. అప్పట్లో అందరూ ఆయనను జనరల్ సాబ్ అని పిలిచేవారు.
 
సెప్టెంబర్ 2014 నుండి ఆగస్టు 2018 మధ్య కాలంలో, ఖండూరి పార్లమెంటరీ రక్షణ స్థాయీ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన పదవీకాలంలో కమిటీ సమర్పించిన నివేదికలు దేశ రక్షణ సంసిద్ధతను విమర్శించడంతో, ఆయనను ఆ పదవి నుండి తొలగించారు. ఆయన కుమారుడు మనీష్ ఖండూరి, 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2024లో తిరిగి బీజేపీలో చేరగా; ఆయన కుమార్తె రీతు ఖండూరి భూషణ్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

భువన్ చంద్ర మృతిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేదని తెలిపారు. భారత రాజకీయాల్లోనే కాకుండా, ఇండియన్ ఆర్మీకి కూడా భువన్ చంద్ర ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ప్రజల హృదయాల్లో ఆయన స్థానం చిరస్థాయిగా నిలిచేలా ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు చేపడుతామని చెబుతూ ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.