గుజరాత్‌ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణం

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 

గుజరాతీ భాషలో భూపేంద్ర పటేల్ ప్రమాణం చేశారు. భూపేంద్ర పటేల్‌ గుజరాత్ 17 వ ముఖ్యమంత్రి.అనంతరం అమిత్‌ షా ను స్వాగతించేందుకు పటేల్ విమానాశ్రయానికి వెళ్లారు. అమిత్‌ షాకు దండం పెట్టి స్వాగతించగా.. ఆయన పటేల్‌ వీపుపై తట్టారు. అంతకుముందు తన ఇంట్లో ప్రార్థనలు చేశారు. అనంతరం తాల్తేజ్‌లోని సాయిబాబా దేవాలయం, అదలాజ్‌లోని దాదా భగవన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి నేరుగా నితిన్‌ పటేల్‌ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు అందుకున్నారు. జామ్‌నగర్‌లో వరద బాదితులకు సహాయం చేస్తానని తొలి ట్వీట్‌ చేశారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయ్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర  మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, మన్షుఖ్ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, పర్సోత్తమ్ రూపాల కూడా హాజరయ్యారు. 

 గుజ‌రాత్ కొత్త ముఖ్య‌మంత్రి భూపేంద్ర ప‌టేల్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. భూపేంద్ర ప‌టేల్ త‌న‌కు చాలా ఏండ్లుగా తెలుస‌ని, ఆయ‌న ఉత్త‌మ‌మైన ప‌నితీరును తాను గ‌మ‌నించాన‌ని ప్ర‌ధాని చెప్పారు. ఆయ‌న భారతీయ జ‌న‌తాపార్టీ కోస‌మైనా, ప‌రిపాల‌న‌లోనైనా, స‌మాజ‌సేవ‌లోనైనా ఉత్తమ ప‌నితీరు క‌న‌బ‌రుస్తార‌ని కొనియాడారు. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఒక ట్వీట్ చేశారు.

కాగా, తనకు ముఖ్యమంత్రి పదవి రాలేదని తాను కలత చెందుతున్నట్లు వస్తున్న కథనాలను మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఖండించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు సోమవారం ఉదయం భూపేంద్ర పటేల్ తనను కలిసిన తర్వాత, నితిన్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ  ‘‘భూపేంద్ర పటేల్ నాకు పాత కుటుంబ స్నేహితుడు. నేను అతడిని అభినందించాను. ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చూసి నేను సంతోషించాను.’’ అని చెప్పారు.

 తన 30 సంవత్సరాల అసోసియేషన్‌లో బీజేపీ తనకు చాలా ఇచ్చిందని, ఎలాంటి బాధలు లేవని నితిన్ పేర్కొన్నారు.తాను ఎన్నో ఒడిదుడుకులు చూశానని, ప్రజల హృదయంలో తానున్నానని నితిన్ వివరించారు. “నేను 18 సంవత్సరాల నుంచి బీజేపీలో పని చేస్తున్నాను, పని చేస్తూనే ఉంటాను. నాకు పార్టీలో స్థానం లభించినా, లేకపోయినా, నేను పార్టీలో సేవ చేస్తూనే ఉంటాను’’అని స్పష్టం చేశారు.