వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రాధాన్యత

రైతులు పండించిన ఉత్పత్తులకు మరింత ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చాలంటే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శోభ కరండ్లాజె సూచించారు.పండిన ఉత్పత్తులను సమయానుగుణంగా ఎగుమతులు చేయడం వల్ల వారికి మరింత ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చడానికి అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్రాలతో సఖ్యతగా వ్యవహరించి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతులకు కృషి చేస్తుందన్నారుని ఆమె తెలిపారు. సోమవారం బిఆర్‌కె భవన్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర సీనియర్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

ఈసందర్భంగా కేంద్ర మంత్రి  మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర పొందుతారని ఆమె చెప్పారు. 

ఎగుమతులు పెరగితేనే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంద‌ని ఆమె స్పష్టం చేశారు. అన్ని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులతో పాటు పరిశ్రమల అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేయాలని ఆమె చెప్పారు. 

దేశంలో మనం పండించిన పంటలు అధిక శాతం మనం వినియోగానికే పరిమితం అవుతున్నాయిని చెబుతూ  పంటల సాగులో ఎరువులు, రసాయనాల వినియోగం తగ్గించి, వరి ధాన్యం, కూరగాయలు, పండ్ల ఉత్పత్తిలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినప్పుడే ఇతర దేశాలకు ఎగుమతి చేయగలుగుతామని ఆమె పేర్కొన్నారు. ఈ దిశగా రైతులు దృష్టి సారించాలని చెప్పారు. 

అధికారులు రైతులను చైతన్యం చేయాలని కోరుతూ వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజలతో పాటు పప్పుగింజల సాగుకు తప్పకుండా సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. పంట ఉత్పత్తులకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి రాష్ట్రం స్వయం స‌మృద్ధి దిశగా అడుగులు వేయాలని ఆమె సూచించారు. డిజిటలైజేషన్ కు ప్రాధాన్యతనివ్వాలని శోభ కరంద్లాజే పేర్కొన్నారు.

తెలంగాణాలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయడం పట్ల కేంద్ర మంత్రి ప్రశంసించారు. తద్వారా పెద్దయెత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.  ఆయిల్ పామ్ సాగుకు వంద శాతం సబ్సిడీ విషయాన్ని పరిశీలిస్తాం అని ఆమె చెప్పారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రకాల పంటల సాగుకు ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యలతో గత ఏడేళ్లలో పంట ఉత్పత్తులు 38 శాతం నుంచి 68 శాతానికి పెరిగిందని తెలిపారు. రైతులకు మంచి లాభాలు వచ్చేపంటల వైపు వారిని మళ్లిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ యువత వ్యవసాయం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నందని మంత్రి వెల్లడించారు.