తాలిబన్‌ల విజయంతో ఉగ్రవాదులకు ధైర్యం

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల విజయంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్‌ల విజయంతో ప్రపంచలోని ఇతర ఉగ్రవాద మూకలకు ధైర్యాన్నిచ్చినట్లైందని హెచ్చరించారు.  ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు పట్టు సాధిస్తున్నారని గుటెరస్‌ పేర్కొన్నారు. 

ఆఫ్రికాలోని సహేల్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల దుశ్చర్యలను ఈ సందర్భంగా ఉదహరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు వారికి మరింత ధైర్యాన్నిచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. చాలా దేశాలు ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితుల్లో లేవని, ప్రపంచమంతా ఐక్యంగా నిలబడితేనే ఎదుర్కోగలమని గుటెరస్‌ స్పష్టం చేశారు. 

ఆయుధాలతో పోరాడుతూ.. చావడానికైనా వెనుకాడని ఉన్మాదులను ఎదుర్కోవడం  అవసరం ఉందని ఆయన తెలిపారు. అన్ని వర్గాలను పాలనలో మిళితం చేయాలని సూచించారు. మానవ హక్కులను కాపాడటం కష్టతరం కాగలదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం సమగ్రంగా ఉండాల్సినగా మహిళలు, బాలికల హక్కులపై ఉన్న ఆందోళనలను తొలగించాలని హితవు చెప్పారు. తద్వారా అంతర్జాతీయ సంబంధాల్లో ఆఫ్ఘనిస్తాన్‌ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. ఆఫ్ఘన్‌లో నెలకొన్న పరిస్థితులు.. అక్కడి ప్రభుత్వ తీరును గమనించిన అనంతరమే ఐరాస ఆర్థిక సాయంపై ఆలోచిస్తామని పేర్కొన్నారు.

ఉగ్రవాదంపై తాలిబాన్లకు ఆరు దేశాల హితవు!

ఆఫ్ఘనిస్తాన్‌ గడ్డ మీది నుంచి ఏ ఉగ్ర సంస్థలు కూడా కార్యకలాపాలు నెరపకుండా చూడాలని తాలిబాన్లకు ఆరు పొరుగు దేశాలు హితవు చెప్పాయి. ఉగ్రవాదమే ఎజెండాగా గల అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.  ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ ఖాయిదాలను పెంచడాన్ని నిరోధించాలని తాలిబాన్‌కు స్పష్టం చేశాయి.

పాకిస్తాన్‌లో ఆరు దేశాల విదేశాంగ మంత్రులు వర్చువల్‌గా సమావేశమయ్యారు. తర్వాత ఈ మేరకు ఈ ప్రకటనను సంయుక్తంగా జారీ చేశారు. తాలిబాన్లను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఉత్తమమని, అలాకాకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో దాయిష్‌, అల్‌ ఖాయిదా పట్టు సాధించేందుకు అనుమతించవద్దని వారు ఆ సంయుక్త ప్రకటనలో కోరినట్లు టోలో న్యూస్‌ నివేదించింది. 

తాలిబాన్‌ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఇలా ప్రకటన రావడం ఇదే మొదటిది.మితవాద విధానాలను అవలంబించాలని తాలిబాన్‌కు ఆరు దేశాలు కోరాయి. అలాగే, ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాల పట్ల స్నేహపూర్వక విధానాలను అవలంబించడం, భాగస్వామ్య లక్ష్యాలను సాధించడం, శాంతి, భద్రతలు, దీర్ఘకాలిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పరిపాలించడం అలవర్చుకోవాలని ప్రకటనలో పేర్కొన్నాయి.

మహిళలు, పిల్లలతో పాటు ప్రాథమిక మానవ హక్కులను గౌరవించాలని ఆరు దేశాలు ఆఫ్ఘన్‌ను కోరాయి. ఈ ఆరు దేశాల సమావేశాలు రొటేషన్‌ పద్ధతిన నిర్వహస్తున్నామని, తదుపరి సమావేశం టెహరాన్‌లో జరుగుతుందని కూడా ఆ ప్రకటనలో తెలిపాయి.

తాలిబన్ల ప్రమాణ స్వీకారం రద్దు

ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రద్దు చేయాలని తాలిబన్లు  నిర్ణయించారు. డబ్బు, వనరుల వృథాను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మంగళవారం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు నేడు కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం శనివారం ఉంటుందని ప్రకటించారు.

నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకకు రష్యా, ఇరాన్, చైనా, ఖతర్, పాకిస్థాన్, ప్రభుత్వాలకు ఆహ్వానాలు కూడా పంపారు. 9/11 అమెరికాపై ఉగ్రదాడిని గుర్తు చేస్తుందని, కాబట్టి దానికి హాజరు కాబోమని ఖతర్‌కు రష్యా తెలిపింది. ‘అమానవీయంగా’ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించకుండా తాలిబన్లకు సలహా ఇవ్వాలని అమెరికా, దాని నాటో మిత్రదేశాలు ఖతర్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కాగా, తాము తాలిబన్ల కొత్త ప్రభుత్వం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం లేదని రష్యా తేల్చిచెప్పింది.

తాలిబన్ల ప్రమాణ స్వీకారం వాయిదా తర్వాత ఆఫ్ఘన్ కల్చరల్ కమిషన్ సభ్యుడు ఇనాముల్లా సమంగాని ట్వీట్ చేస్తూ.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవాన్ని కొన్ని రోజుల క్రితమే రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ కేబినెట్‌ను ప్రకటించిందని, అది ఇప్పటికే పని చేయడం ప్రారంభించిందని తెలిపారు.