ఆ నాలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ బీజేపీదే అధికారం

వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో మ‌ళ్లీ బీజేపీదే అధికార‌మ‌ని ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ధీమా వ్య‌క్తంచేశారు. తాము చేయించిన అన్ని స‌ర్వేలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఆ నాలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు బీజేపీనే ఆశీర్వ‌దించ‌నున్నార‌ని న‌డ్డా పేర్కొన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బూత్ విజ‌య్ అభియాన్ ప్రారంభించిన సంద‌ర్భంగా న‌డ్డా ప్ర‌సంగించారు.

2017లో జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యోగీ అదిత్య‌నాథ్ నాయ‌క‌త్వంలో బీజేపీ చారిత్ర‌క విజ‌యం సాధించింద‌ని జేపీ న‌డ్డా గుర్తు చేశారు. 2014, 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కూడా యూపీ ప్ర‌జ‌లు అభివృద్ధి రాజ‌కీయాల‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని పేర్కొన్నారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కులతత్వం, మతతత్వం, వారసత్వం, రాచరికం అన్నీ అంతమొందాయి. వీటిన్నిటినీ దాటి దేశంలో అభివృద్ధి ముందుకు వచ్చింది. మోదీ నాయకత్వంలో 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 325 స్థానాలను గెలుచుకుంది. అలాగే 2014, 2019 సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీనే గెలిచింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుంది. మరోసారి యూపీలో కమల ప్రభుత్వమే ఏర్పడుతుంది’’ అని నడ్డా భరోసా వ్యక్తం చేశారు. 

యూపీలో మ‌ళ్లీ బీజేపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్ప‌డానికి ఇక్క‌డి పార్టీ కార్య‌క‌ర్త‌ల ఉత్సాహ‌మే సంకేత‌మ‌ని చెప్పారు. మోదీ హ‌యాంలో కుల రాజ‌కీయాలు, కుటుంబ రాజ‌కీయాలు, మ‌త రాజ‌కీయాలు, వార‌స‌త్వ రాజ‌కీయాలు మంట‌గ‌లిసి పోయాయ‌ని న‌డ్డా వ్యాఖ్యానించారు.

రైతు సమస్యలపై ప్రస్తావిస్తూ అంతకు ముందు 70 ఏళ్లలో చేయని విధంగా రైతులు, వ్యవసాయం కోసం ప్రధాని మోదీ గత ఏడేళ్లలో చాలా ఎక్కువగా చేశారని ప్రశంసించారు. కనీస మద్దతు ధర గురించి కాంగ్రెస్, ఎన్సీపీ, బీఎస్పీ లతో సహా ప్రతిపక్షాలన్నీ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. అయితే ఈ ఏడాది కనీస మద్దతు ధరకు రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరిగినదని తెలిపారు. 

రైతులకు ప్రభుత్వం తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా, తమకు నచ్చిన ధరకు అమ్ముకొనే స్వేచ్ఛను కల్పించిందని నడ్డా గుర్తు చేశారు. రైతులకు నెలకు రూ 3,000 పెన్షన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినదని చెప్పారు. 

ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మొదటిసారి రాష్ట్రంలో అభివృద్ధి పట్ల దృష్టి సారించిందని చెబుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి రూ 10.90 లక్షల కోట్లుగా ఉన్న జిడిపి దాదాపు రెట్టింపు అయినదని తెలిపారు. అట్లాగే పెట్టుబడుల రూ 11 లక్షల కోట్ల నుండి రూ 22 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. 

అనంత‌రం పేరు ప్రస్తావించ‌కుండానే కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్‌గాంధీపై జేపీ న‌డ్డా విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌న ద‌గ్గ‌ర పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్నా విడిది కోసం విదేశాల‌కు వెళ్లే నాయ‌కులు ఉన్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. క‌రోనా స‌మ‌యంలో ఒక్క బీజేపీ త‌ప్ప అన్ని పార్టీలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయ‌ని, క్వారెంటైన్‌లో ఉన్నాయ‌ని తెలిపారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లు మాత్ర‌మే ప్రాణాల‌కు తెగించి ప్ర‌జ‌ల‌కు సాయం చేశార‌ని కొనియాడారు.