తెలంగాణలో బీజేపీదే అధికారం

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీదేనని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం తామేనని, ఆ పార్టీతో బీజేపీ రాజకీయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తాము ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నామని, వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు తమపై సంపూర్ణ విశ్వాసం ఉంచుతారన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో లంచ్‌ సందర్భంగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ విమానాశ్రయాల గురించి మాత్రమే చర్చించినట్లు సింధియా తెలిపారు. కేసీఆర్‌తో ఎలాంటి రాజకీయ అంశాలూ ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి మీడియా సమావేశంలో సింధియా మాట్లాడారు. 

ప్రధాని మోదీ తనపై ఉంచిన బాధ్యత మేరకు కేంద్రమంత్రిగా ఇక్కడకు వచ్చానని, రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి సంబంధించి మాత్రమే సీఎంతో చర్చించానని చెప్పారు. ప్రధాని మోదీ విజన్‌ను అమలు చేయడమేకేంద్రమంత్రిగా తన బాధ్యత అని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒక్క స్థానమే గెలిచినా.. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకుందని, రాష్ట్రంలో పార్టీ బలపడిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన గుర్తు చేశారు.

అనంతరం దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని తెలిపారు.  నిజామాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ స్థానాలను బీజేపీ సాధించిందని గుర్తు చేశారు. ఇక విమాన టికెట్‌ ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాని మోదీ లక్ష్యమని సింధియా చెప్పారు. రైల్వే ఏసీ ఫస్ట్‌క్లాస్‌ కంటే కూడా విమాన టికెట్‌ ధర తక్కువగా ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయం విస్తరణ చేపట్టబోతున్నామని తెలిపారు.

రెండేళ్లలో పిజ్జాలు, కొరియర్‌ సేవలు డ్రోన్‌ల ద్వారా వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. డ్రోన్‌ పైలట్‌ లైసెన్సు రెండు, మూడు నెలల్లోనే ఇస్తారని, వాహన రిజిస్ట్రేషన్‌లాగే ప్రతి డ్రోన్‌కు రిజిస్ట్రేషన్‌ ఉంటుందని చెప్పారు. ఇక విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రైవేటీకరణ కాదని, నిర్ధిష్ట కాలపరిమితి తర్వాత వాటిని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

శంషాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి సహకరిస్తా 

దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. 

తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి సింధియా స్పష్టం చేశారు. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన కేంద్రమంత్రి సింధియా శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 

అనంతరం జరిగిన భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ బిజినెస్ హబ్‌గా, ఐటీ హబ్‌గా, హెల్త్ హబ్‌గా, టూరిజం హబ్‌గా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఇంకా విస్తరిస్తుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, పలు అంతర్జాతీయ నగరాల నుండి ప్రయాణికులు వస్తున్నందున సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, యూఎస్ లకు హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్స్ కనెక్టివిటీని పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సింధియా దృష్టికి తీసుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతిపాదనలో ఉన్న 6 ఎయిర్ పోర్టుల్లో ఒకటైన వరంగల్ (మామునూరు) ఎయిర్ పోర్టు అథారిటీ లాండ్ (ఏఐ) ఏటీఆర్ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. నిజామాబాద్ జిల్లా (జక్రాన్ పల్లి)లో ఎయిర్ పోర్టుకు సంబంధించిన టెక్నికల్ క్లియరెన్స్ ఇస్తామని పేర్కొన్నారు. 

ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టును ఎయిర్ ఫోర్స్ ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని తమ మంత్రిత్వశాఖ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. పెద్దపల్లి (బసంత్ నగర్), కొత్తగూడెం, మహబూబ్ నగర్ (దేవరకద్ర) ఎయిర్ పోర్టుల్లో చిన్న విమానాలు వచ్చిపోయేలా చేయడానికి పున: పరిశీలన చేసి, తగు చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి సింధియా హామీ ఇచ్చారు.