మహారాష్ట్రలో స్థానిక పోరుకు 30 లక్షల కార్యకర్తలతో బిజెపి సైన్యం!

మహారాష్ట్రలో వచ్చే ఏడు ప్రారంభంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ స్థానిక సంస్థలకు జరుగనున్న ఎన్నికలలో తమ పట్టును నిలబెట్టుకోవడం కోసం బిజెపి `సమర్త్ బూత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా 30 లక్షల మంది కార్యకర్తలతో  సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. 

రాష్ట్రంలోని 27 మునిసిపల్ కార్పొరేషన్లలో 23, 36 జిల్లా కౌన్సిల్‌లలో 27, 362 నగర పంచాయితీలు, మునిసిపల్ కౌన్సిల్స్‌లో 300 కి పైగా, 290 కి పైగా పంచాయితీ సమితులకు వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరుగనున్నాయి.  ఈ ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించే పార్టీకి రెండేళ్ల తర్వాత జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకనే వీటిని  మినీ-అసెంబ్లీ ఎన్నికలుగా భావిస్తున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక స్థానిక సంస్థలలో బిజెపి అధికారంలో ఉంది.

సమర్థ్ బూత్ అభియాన్

ఎన్నికలకన్నా ముందే వ్యక్తిగతంగా ఓటర్లను కలిసేందుకు శ్యామప్రసాద్ ముఖర్జీ సమర్థ్ బూత్ అభియాన్‌ను ప్రారంభించారు.  రాష్ట్రంలోని ప్రతి 96,605 పోలింగ్ బూత్‌లకు ఒకొక్కరిని ఈ సందర్భంగా నియమిస్తున్నారు.  వారి  క్రింద, 31 మంది ప్రముఖులు లేదా ఎలక్టోరల్ రోల్ పేజీ హెడ్ ఉంటారు. 

ఓటింగ్ రోజు వరకు ప్రతి ఓటర్‌ని అనేకసార్లు సంప్రదించాల్సిన బాధ్యత  వారిపై ఉంటుంది. ఐదు బూత్‌లకు ఒకరు శక్తి కేంద్ర ప్రముఖులు ఉంటారు. బూత్-స్థాయి కార్యకర్తలకు సాంకేతికత వినియోగంతో ఓరియంటేషన్, శిక్షణ ఇస్తారు. బిజెపి ఎమ్యెల్సీ రామదాస్ అంబట్కర్, సమర్థ్ బూత్ అభియాన్ డ్రైవ్ కన్వీనర్.  జూలై 6 న ప్రారంభమైన ఈ డ్రైవ్ కోసం 30 లక్షలకు  పైగా పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారని, ఇది సెప్టెంబర్ 17 న పూర్తవుతుందని ఆయన చెప్పారు.

“మేము 80,000 బూత్‌లలో బూత్, పేజీ హెడ్‌ల నియామకాలను పూర్తి చేసాము. మిగిలినవి రాబోయే కొద్ది రోజుల్లో పూర్తవుతాయి. ప్రతి బూత్‌లో దాదాపు 30 పేజీల ఓటర్లు ఉంటారు. ప్రతి పేజీలో దాదాపు 12 కుటుంబాలు ఉంటాయి. మేము ఇప్పటికే 24 లక్షల మంది కార్యకర్తలను చేర్చుకున్నాము” అని ఆయన తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ సంఖ్య30 లక్షలకు చేరుకొంటుందని భావిస్తున్నారు.

గతసారి పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్ల ఆధారంగా ఎ, బి, సి వర్గాలుగా బూత్‌లను వర్గీకరించారు. బూత్ కార్యకర్తలు నిరంతరం ఓటర్లతో సంబంధాలు కలిగి ఉండటం ద్వారా పనితీరును అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు ఆయా కుటుంభ సభ్యుల సమస్యలు, వారి ఉపాధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడంలో వారికి  సహాయపడతారు. ఈ డ్రైవ్‌లో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన వార్ రూమ్‌ల బ్యాకప్ ఉంది. అన్ని వార్ రూమ్‌లను రాష్ట్ర స్థాయి వార్ రూమ్‌తో అనుసంధానించారు. 

వార్ రూమ్‌లు మూడు స్థాయిలలో పనిచేస్తాయి-సోషల్ మీడియా నిర్వహణ, బూత్-స్థాయి కార్యకర్తల వరకు కమ్యూనికేషన్‌లను ఏర్పాటు చేయడం, ఓటర్లకు పంపిణీ చేయవలసిన సమాచారాన్ని తయారుచేయడం. వార్ రూమ్‌లు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాయి. దిగువ స్థాయి నుండి అందించిన సమాచారాన్ని సరిచూసుకుంటాము. 

అదే  సమయంలో, ఇది వివిధ స్థాయిలలో ప్రజల కోసం అమలు చేయబడిన కార్యక్రమాలు, పథకాల ఆధారంగా కంటెంట్‌ను కూడా అందిస్తుంది, రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేపట్టిన రెండు కార్యక్రమాలు చూస్తే ఈ ప్రణాళిక అమలుకు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టం అవుతుంది. 

బుధవారం నాడు ఫడ్నవీస్ తన నియోజకవర్గం నుండి నాగపూర్‌లోని 23 బూత్ ప్రముఖులను వారి ఇళ్లలో సందర్శించారు. పాటిల్ మంగళవారం వర్చువల్ సమావేశంలో బూత్ ప్రముఖులు, శక్తి కేంద్ర ప్రముఖులతో సహా లక్ష మందికి పైగా పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు.

కేంద్ర పథకాలపై దృష్టి 

నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రధాన మంత్రి  ఆవాస్ యోజన, పీఎం- కిసాన్, ఉజ్జ్వల యోజన వంటి వివిధ కేంద్ర పథకాల ద్వారా ప్రజలకు అందించిన ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని రూపొందించడంలో జిల్లా స్థాయి వార్ రూమ్‌లు నిమగ్నమై ఉన్నాయి. విస్తరణ కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర ఓటర్లు ఈ పథకాల లబ్ధిదారులను సత్కరించి, వారిని ఇతర ఓటర్ల ముందు ఉదాహరణలుగా నిలుపుతారు. 

“నూతన కేంద్ర మంత్రుల జన ఆశీర్వాద్ యాత్ర మా పనిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి,  పరిచయాలను ఏర్పర్చుకోవడానికి మరొక ప్రయత్నం. అదేవిధంగా, మేము స్థానిక సంస్థలలో అభివృద్ధి పనులను ప్రజల వద్దకు తీసుకువెళుతున్నాము. కాంగ్రెస్ వంటి పార్టీల పనితీరుతో ప్రజలు మా పనితీరును పోల్చి చూసే విధంగా వారికి అందిస్తాము ”అని పార్టీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు.

పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లే పార్టీ వ్యూహంలో భాగంగా, రాష్ట్ర నాయకులు పుణె, నాగ్‌పూర్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముంబైలో, పార్టీ మూడు దశాబ్దాల పాటు మునిసిపల్ కార్పొరేషన్ లో నెలకొన్న అవినీతి ఆరోపణలు, నగరం పేలవమైన అభివృద్ధి ఆధారంగా శివసేనపై దాడికి సిద్ధమవుతున్నారు.

“బీఎంసీ  (బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్) ఎన్నికల్లో పార్టీ ప్లాంక్ ముంబై అభివృద్ధి. నగరం-దాని మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం బిఎంసిలో బిజెపి అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో ఓటర్లను ఒప్పించేందుకు మేము ప్రయత్నిస్తాము, ”అని చెబుతున్నారు.

అభ్యర్థుల ఎంపిక కీలకం 

గత డిసెంబరులో శాసన మండలి ఎన్నికల తర్వాత పార్టీ రాష్ట్ర యూనిట్ పాఠాలు నేర్చుకుంది, ఇందులో ఆరు సీట్లలో నాలుగు కోల్పోయింది.  ఇందులో రెండు పార్టీకి మంచి పట్టుగల  పూణే,  నాగపూర్ ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లే అందుకు కారణం అని నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం ప్రారంభించింది.

 “2019 లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుండి నాయకులను దిగుమతి చేసుకునే ప్రయోగం బాగా పనిచేసింది. ఇతర పార్టీల నుండి బలమైన స్థానిక నాయకులపై ఆధారపడాల్సిన అనేక జిల్లాల్లో మాకు ఆధారం లేదు. అంతిమంగా, ఎన్నికల్లో గెలుపు సాధ్యమే. ముంబై, ఇతర నగరాలలో ఇతర పార్టీల నుండి నాయకుల ప్రవాహం ఉంటుంది, ”అని ఓ నాయకుడు చెప్పారు.

పార్టీ నాయకులు కృపా శంకర్ సింగ్ వంటి నాయకులను చేర్చుకోవడం, నారాయణ్ రాణే కేంద్ర మంత్రిగా ఎదగడం ఈ ఎన్నికల్లో తమకు సహాయపడుతుందని కూడా భావిస్తున్నారు.  బిజెపిలో చేరిక కోసం ఇతర పార్టీల నుండి ఇలాంటి నాయకులను మరింత మందిని ఆదరిస్తామని చెబుతున్నారు.

స్థానిక సంస్థలలో ప్రస్తుత బలాన్ని నిలుపుకోవడం తమ ముందున్న కఠినమైన కర్తవ్యం అని భావిస్తున్నారు. కార్పొరేషన్లు, జిల్లా కౌన్సిల్స్, నగర్ పంచాయతీల సభ్యుల పరంగా ప్రస్తుతం నాలుగవ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానం కోసం లక్ష్యం పెట్టుకున్నారు. 

అయితే 2019లో రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో, ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు కలిగి ఉంది. దానితో సహజంగానే స్థానిక ఎన్నికలలో బిజెపి కొంత లాభపడింది. అయితే ఈ సారి ప్రతిపక్షంలో ఉండడం, మూడు ప్రత్యర్థి పార్టీలు కలసి పోటీచేసే అవకాశం ఉండడంతో బిజెపి మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.